పెంపుడు జంతువులు దాడి చేస్తే యజమానులకు రూ.10వేల జరిమానా

పెంపుడు జంతువులు దాడి చేస్తే యజమానులకు రూ.10వేల జరిమానా

కుక్కకాటు ఘటనలను నివారించేందుకు నోయిడా అథారిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెంపుడు జంతువులు ఎవరిపైనైనా దాడి చేస్తే వాటి యజమానులకు రూ.10వేల జరిమానా విధించాలని ఆదేశించారు. ఈ క్రమంలో పెట్ పాలసీలో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా పెంపుడు జంతువు వల్ల అయిన గాయాల చికిత్స కోసం అన్ని వైద్య ఖర్చులను యజమానే భరించవలసి ఉంటుందని నోయిడా అథారిటీ సీఈఓ రీతు మహేశ్వరి నిర్ణయించారు.  పెంపుడు జంతువుల యజమానులు తమ పెంపుడు జంతువులను జనవరి 31, 2023లోగా నమోదు చేసుకోవడాన్ని కూడా అథారిటీ తప్పనిసరి చేసింది. ఒకవేళ ఆ నిబంధనలో విఫలమైతే రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పెంపుడు జంతువులకు సంబంధించిన పారిశుద్ధ్య సమస్యల విషయంలో కూడా జరిమానా విధించబడుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గత నెలలో నోయిడాలోని సెక్టార్ 100లోని రెసిడెన్షియల్ సొసైటీలో వీధికుక్క దాడి చేయడంతో ఏడు నెలల చిన్నారి మరణించింది. దీని వల్ల పరిసర ప్రాంత ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో కుక్కల జనాభా పెరుగుదలను పరిష్కరించడానికి పౌర అధికారులు మరింత కృషి చేయాలని డిమాండ్ చేశారు. 2022 జనవరి నుంచి ఆగస్టు 21 వరకు కుక్కలు దాడి చేసిన 13,690 కేసులు నమోదైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నగరంలో పెరుగుతున్న కుక్కల దాడిని ద-ృష్టిలో పెట్టుకొని అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు.