ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్

MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీపై జరిగిన దాడి కేసులో కోర్టుకు అసద్‌ హాజరు కాకపోవడంతో ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

2015లో మీర్‌చౌక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఆ తర్వాత కారులో తిరుగు పయనం అయ్యారు. ఆ సందర్భంగా వారు ప్రయాణిస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డగించారు. అందులో కొంతమంది కారు లోపల కూర్చున్న షబ్బీర్ అలీపై దాడి చేశారు. ఆ సమయంలో MIM అధినేత అసదుద్దీన్ కూడా అక్కడే ఉన్నారు. తనపై జరిగిన దాడిని నిరసిస్తూ షబ్బీర్ అలీ మీర్‌చౌక్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఈ ఘటనకు బాధ్యుడిగా అసదుద్దీన్‌ను చేర్చారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

దానిపై విచారించిన ధర్మాసనం.. అసదుద్దీన్‌ను విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే, ఆయన కోర్టుకు హాజరుకాలేదు. దాంతో ఆగ్రహించిన ధర్మాసనం.. తాజాగా ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

అయితే ఇవాళ కోర్టుకు హాజరైన అసదుద్దీన్ నాన్ బెయిలబుల్ వారెంట్ ను రద్దు చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం.