గత ప్రభుత్వాలకు నార్త్‌‌, ఈస్ట్‌‌ ‘దూరంగా’ ఉండేది: మోడీ

గత ప్రభుత్వాలకు నార్త్‌‌, ఈస్ట్‌‌ ‘దూరంగా’ ఉండేది: మోడీ
  • ఈశాన్యాన్ని దగ్గర చేస్తున్నం
  • గత ప్రభుత్వాలకు నార్త్‌‌ఈస్ట్‌‌ ‘దూరంగా’ ఉండేది: మోడీ
  • గౌహతిలో ఎయిమ్స్‌‌, మరో 3 మెడికల్ కాలేజీలు ప్రారంభం

గౌహతి: నార్త్‌‌ఈస్ట్‌‌ను ప్రతిపక్షాలు నిర్లక్ష్యం చేశాయని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. “గత ప్రభుత్వాలకు ఈశాన్య ప్రాంతం ‘దూరంగా’ ఉండేది. దాన్ని ‘దగ్గర’కు తీసుకురావడానికి మేం అంకితభావంతో పనిచేశాం. గత 9 ఏండ్లుగా ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేశాం” అని అన్నారు. నార్త్‌‌ఈస్ట్‌‌లో నిర్మించిన మొట్టమొదటి ఎయిమ్స్‌‌ను ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. గౌహతిలో రూ.1,123 కోట్లతో నిర్మించిన ఎయిమ్స్‌‌కు 2017లో ప్రధాని శంకుస్థాపన చేశారు.

ఎయిమ్స్ ను జాతికి అంకితం చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. అస్సాంలో అభివృద్ధి ఘనత తమకు రావడం లేదని ప్రతిపక్షాలు ఆవేదన చెందుతున్నాయని పరోక్షంగా విమర్శించారు. రూ.546 కోట్లతో నిర్మించనున్న అస్సాం అడ్వాన్స్‌‌డ్‌‌ హెల్త్‌‌కేర్ ఇన్నోవేషన్ ఇన్‌‌స్టిట్యూట్ కూ ప్రధాని శంకుస్థాపన చేశారు. 1.1 కోట్ల ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. నల్బరి, నాగావ్, కోక్రాజర్‌‌‌‌ మెడికల్ కాలేజీలను వర్చువల్‌‌గా లాంచ్ చేశారు. గౌహతి హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల్లోనూ మోడీ మాట్లాడారు. నార్త్‌‌ఈస్ట్‌‌ వంటి మారుమూల ప్రాంతాల్లో ‘జస్టిస్ డెలివరీ సిస్టమ్‌‌’లో వేగం పెంచేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  

బిహూ డ్యాన్స్.. గిన్నిస్ రికార్డ్ 

గౌహతిలోని సరుసజాయ్ స్టేడియంలో గురువారం11,304 మంది డ్యాన్సర్లు, 2,548 మంది డ్రమ్మర్లు కలిసి బిహూ డ్యాన్స్ ప్రదర్శించారు.  అత్యధిక మంది పాల్గొన్న బిహూ డ్యాన్స్ ఈవెంట్ గా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. శుక్రవారం ప్రధాని మోడీ, సీఎం హిమంత బిశ్వ శర్మ సమక్షంలో కూడా బిహూ డ్యాన్స్​ ప్రదర్శించారు.

మోడీజీ.. మాకు స్కూల్ కట్టివ్వరూ..: జమ్మూ చిన్నారి క్యూట్ రిక్వెస్ట్  

జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని కథువా జిల్లా లోహయ్ మల్హార్‌‌‌‌ గ్రామానికి చెందిన చిన్నారి సీరత్ నాజ్.. ప్రధాని మోడీకి క్యూట్ రిక్వెస్ట్ చేసింది. ‘‘ప్లీజ్ మోడీజీ.. మంచి స్కూల్ కట్టివ్వరూ” అని అడిగింది. తమ స్కూల్ శుభ్రంగా ఉండటం లేదని, తాను, తన ఫ్రెండ్స్​ కూర్చోవడం కష్టంగా ఉందని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘మోడీజీ మీకు ఓ విషయం చెప్పాలి. (రెండు రూమ్‌‌లను చూపిస్తూ..) ఇవి ప్రిన్సిపాల్ ఆఫీస్, స్టాఫ్‌‌ రూమ్. చూడండి కింద ఎంత గలీజ్‌‌గా ఉందో. మమ్మల్ని ఇక్కడ కింద కూర్చోమంటున్నారు” అని తెలిపింది. తర్వాత స్కూల్‌‌ను చూపెట్టింది. ఐదేళ్లుగా బిల్డింగ్‌‌ ఇలానే అపరిశుభ్రంగా ఉందని చెప్పింది. ‘‘మోడీజీ.. మీరు దేశం మాట వింటారు కదా. నేను చిన్న పిల్లని కదా. నా మాట కూడా వినండి ప్లీజ్. మా కోసం ఓ మంచి స్కూల్ కట్టించండి. అక్కడ కింద కూర్చునే పరిస్థితి ఉండకూడదు. అప్పుడు యూనిఫామ్‌‌ మాసిపోయిందని మా అమ్మ తిట్టదు. మేం బాగా చదువుకుంటాం” అని చెప్పడం అందరినీ ఆకట్టుకుంటోంది.