Santosh Sobhan: క్లారిటీ కోసమే బ్రేక్.. కమ్ బ్యాక్ కోసం కాదు: కెరీర్‌పై సంతోష్ శోభన్ కామెంట్స్ వైరల్!

Santosh Sobhan: క్లారిటీ కోసమే బ్రేక్.. కమ్ బ్యాక్ కోసం కాదు: కెరీర్‌పై సంతోష్ శోభన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్‌లో తనదైన సహజమైన నటనతో 'బాయ్ నెక్స్ట్ డోర్' ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు సంతోష్ శోభన్. ‘గోల్కొండ హై స్కూల్’తో బాలనటుడిగా మెప్పించి, నేడు యువత మెచ్చే కథానాయకుడిగా ఎదిగిన సంతోష్.. కొంత కాలంగా బ్రేక్ ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే లేటెస్ట్ గా ఆయన నటించిన ' కపుల్ ఫ్రెండ్లీ'  ప్రమోషన్ లో భాగంగా తన కెరీర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

స్పష్టత కోసమే చిన్న విరామం
చాలామంది హీరోలు వరుస పరాజయాలు ఎదురైనప్పుడు లేదా అవకాశాలు తగ్గినప్పుడు 'బ్రేక్' తీసుకుంటారు. కానీ సంతోష్ శోభన్ రూటే సెపరేటు. "నేను విరామం తీసుకుంది కమ్ బ్యాక్ ఇవ్వడానికి కాదు.. కెరీర్‌పై క్లారిటీ తెచ్చుకోవడానికి" అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు. నటుడిగా తానెటు వెళ్తున్నాను? ప్రేక్షకులకు ఎలాంటి కథలు ఇవ్వాలి? అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కునేందుకే ఈ గ్యాప్ తీసుకున్నానని స్పష్టం చేశాడు.  అయితే సంతోష్ గురించి నెటిజన్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే ఒక విషయం ఆయన పుట్టినరోజు. చాలా చోట్ల స్పష్టమైన సమాచారం లేకపోవడంతో అభిమానుల్లో ఉన్న సందేహాలకు తెరదించుతూ.. ఆయన 1995 జూలై 12న జన్మించానని క్లారిటీ ఇచ్చారు.

ఒకే ఏడాది నాలుగు సినిమాలు
విరామం తర్వాత మరింత ఉత్సాహంతో కెమెరా ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో, ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కేవలం సినిమాల సంఖ్య పెంచడమే కాకుండా, కథల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా ఒక 'కపుల్ ఫ్రెండ్లీ' స్క్రిప్ట్‌తో త్వరలోనే మన ముందుకు రానున్నాడు. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

వారసత్వంపై నిజాయితీ గల మాట..
స్టార్ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుతూ.. బ్యాక్‌గ్రౌండ్ వల్ల ఎంట్రీ సులభం కావచ్చు, కానీ ప్రేక్షకుల్లో అంగీకారం రావాలంటే మాత్రం కష్టం మినహా మరో మార్గం లేదని సంతోష్ నిజాయితీగా అంగీకరించాడు. తొందరపాటుతో తప్పులు చేయడం కంటే, నిలకడగా.. నిజాయితీగా సినిమాలు చేయాలనుకుంటున్న సంతోష్ శోభన్ నిర్ణయం చూస్తుంటే, టాలీవుడ్‌లో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మరింత స్ట్రాంగ్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది.