- పర్యావరణానికి ఢోకా లేకుండా గ్రేడ్ సెపరేటర్ కారిడార్
- ట్రాఫిక్ కష్టాలకు చెక్.. 72 శాతం కాలుష్యం తగ్గే అవకాశం!
- ప్రత్యేక వీడియోలో స్పష్టం చేసిన బల్దియా
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అదే కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించతలపెట్టిన ‘గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్’.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రత్యేక వీడియోను ఆదివారం విడుదల చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర ప్రగతిని బ్యాలెన్స్ చేస్తూ, ‘గ్రీన్ హైదరాబాద్’ లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
‘జీరో పార్క్ ఇంట్రూజన్’ విధానం
కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్‌కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ‘జీరో పార్క్ ఇంట్రూజన్’ విధానం ద్వారా పార్క్ భూములను ఏ మాత్రం తాకకుండా, కేవలం ప్రస్తుతం ఉన్న రోడ్డు మీడియన్లలోనే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేబీఆర్ పార్క్‌లోని ఒక్క చెట్టును నరకబోమని స్పష్టం చేశారు. కేవలం సెంట్రల్ మీడియన్‌లో ఉన్న చెట్లను మాత్రమే అధునాతన ‘ట్రాన్స్‌ప్లాంటేషన్’ పద్ధతి ద్వారా సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలించనున్నట్లు పేర్కొన్నారు.
40 రెట్లు వేగంగా ‘స్టీల్’ నిర్మాణాలు
నిర్మాణ సమయంలో వాహనదారులకు, స్థానికులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ ఆ వీడియోలో స్పష్టం చేసింది. సాంప్రదాయ కాంక్రీట్ నిర్మాణాలకు బదులుగా స్టీల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పింది. స్టీల్ నిర్మాణాల వల్ల పనులు సాధారణం కంటే 30 నుంచి 40 రెట్లు వేగంగా పూర్తవుతాయని, దీనివల్ల రోడ్లపై ఎక్కువ కాలం ట్రాఫిక్ఇబ్బందులు ఉండవని తెలిపారు.
జూబ్లీహిల్స్ టూ మాదాపూర్.. సిగ్నల్ ఫ్రీ
ప్రాజెక్టు పూర్తయితే జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఫిలింనగర్ వరకు పూర్తి సిగ్నల్ ఫ్రీ కారిడార్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. రోడ్ నంబర్45, ఫిల్మ్‌నగర్, క్యాన్సర్ హాస్పిటల్, ముగ్ధా జంక్షన్లను కలుపుతూ ఈ గ్రేడ్ సెపరేటర్లను నిర్మిస్తామని ప్రకటించింది. దీనివల్ల జూబ్లీహిల్స్– మాదాపూర్ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ ఇబ్బందులనే కాకుండా పర్యావరణానికి సైతం పెద్ద ఎత్తున మేలు చేస్తుందని చెప్పింది.
కాలుష్యానికి బ్రేక్:
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలలో వాయు కాలుష్యం 72 శాతం వరకు తగ్గుతుంది.
- జంక్షన్లలో ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి. వాహనదారులకు సుమారు రూ.40 కోట్ల లీటర్లకు పైగా ఇంధనం ఆదా అవుతుంది.
- వాయు కాలుష్యం తగ్గడం ద్వారా ఏకంగా 13.66 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను అరికట్టవచ్చని అధికారులు లెక్కగట్టారు.
