- ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 5,6 తేదీల్లో ఇచ్చేందుకు రంగం సిద్ధం
- కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే విచారించేందుకు సిట్ ఏర్పాట్లు
- చార్జిషీట్ దాఖలు చేసేందుకు పక్కా ఆధారాల సేకరణ
- సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ స్టేట్‌మెంట్ మరోసారి రికార్డు
హైదరాబాద్, వెలుగు:ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురికి వచ్చే నెల మొదటి వారంలో నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమైంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును సిట్అధికారులు14 రోజులపాటు విచారించి, పలు వివరాలు రాబట్టారు. ఇందుకు సంబంధించి జనవరి 16న సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ఆలోపే బీఆర్ఎస్ ముఖ్యనేతలను విచారించాలని సిట్అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు షెడ్యూల్ కూడా రెడీ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్ట్ దాఖలు కోసం న్యాయసలహాలు తీసుకుంటున్నది. పక్కా ఆధారాల సేకరణలో సిట్‌న్యాయ విచారణలో కేసు వీగిపోకుండా సిట్ అధికారులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో బాధితుల నుంచి రికార్డ్ చేసిన స్టేట్‌మెంట్లను పరిశీలిస్తున్నారు.
ఈ మేరకు సాక్షులు, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాను వారి సమక్షంలోనే మరోసారి డ్రాఫ్టింగ్ చేస్తున్నారు. ట్యాపింగ్ లిస్ట్ ఆధారంగా ఆయా ఫోన్ నంబర్లు బాధితులు వెల్లడించే అంశాలతో కేసు ఫైల్ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల విశ్లేషకుడు, ఆరా పోల్ స్ట్రాటజీస్ సంస్థ నిర్వాహకుడు ఆరా మస్తాన్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు.
మస్తాన్ నిర్వహించిన సర్వేలు, వాటి ఫలితాలపై ఎస్‌ఐబీ మానిటరింగ్ సిట్ సభ్యులు రామగుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా ఆధ్వర్యంలో మస్తాన్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో మస్తాన్ నిర్వహించిన సర్వేలు, వాటి ఫలితాల గురించి ప్రస్తావించినట్లు తెలిసింది.ఈ క్రమంలోనే 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎలక్షన్లతోపాటు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఆరా మస్తాన్ సర్వేలను ఎస్‌ఐబీ స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీమ్ మానిటరింగ్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ క్రమంలోనే ట్యాపింగ్ లిస్ట్‌లో లభించిన ఫోన్ నంబర్ల ఆధారంగా ఇప్పటికే రెండు సార్లు మస్తాన్ స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. వాటిని మళ్లీ పరిశీలించారు. స్టేట్‌మెంట్‌లో అస్పష్టంగా ఉన్న పలు అంశాలకు సంబంధించి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు.
ఫోన్ కాల్స్, కమ్యూనికేషన్‌పై నిఘా పెట్టారు: ఆరా మస్తాన్
రెండున్నర గంటల పాటు సిట్ స్టేట్‌మెంట్ రికార్డ్ అనంతరం ఆరా మస్తాన్ మీడియాతో మాట్లాడారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి సిట్‌కు పలు ఆధారాలు అందించానన్నారు. తన ఫోన్ కాల్స్, సర్వే కమ్యూనికేషన్‌పై నిఘా ఉండేదని తెలిపారు.ఈ అంశాన్ని విచారణలో సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చానని తెలిపారు. గతంలో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన సమయంలో అడిగిన ప్రశ్నలనే మరోసారి అడిగి, తన వాంగ్మూలాన్ని నిర్ధారించుకున్నారని వెల్లడించారు. సర్వేల సమయంలో అన్ని పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అనుమానాలున్నాయని మస్తాన్ పేర్కొన్నారు.
