
ప్రస్తుతం జరుగుతున్న యుఎస్ ఓపెన్ 2025లో సెర్బియా టెన్నిస్ లెజెండ్ నోవాక్ జొకోవిచ్ దూసుకెళ్తున్నాడు. తిరుగులేని ఆటతో యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం (సెప్టెంబర్ 1) ఉదయం జరిగిన నాలుగో రౌండ్ లో జాన్-లెన్నార్డ్ స్ట్రఫ్‌ను వరుస సెట్లలో ఓడించాడు. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో జొకోవిచ్ 6-3, 6-3, 6-2 తో స్ట్రఫ్‌ను చిత్తు చేశాడు. 38 ఏళ్ళ వయసులో తన రిటైర్మెంట్ పై వార్తలు వస్తున్న సమయంలో జోకో తన ప్రదర్శనతో విమర్శకులకు చెక్ పెట్టాడు.
ఈ విజయంతో జొకోవిచ్ ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే సీజన్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలోనూ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. ఓవరాల్ గా జొకోవిచ్ కెరీర్ లో ఇది 64వ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్. ఈ మ్యాచ్ విషయానికి వస్తే జొకోవిచ్ తన సత్తా చూపించాడు. ప్రత్యర్థి స్ట్రఫ్ సర్వీస్ కు ఏకంగా ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 12 ఏస్ లు కొట్టడంతో పాటు ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ఓవరాల్ గా జొకోవిచ్ ఈ మ్యాచ్ లో 90 పాయింట్లు సాధించి పూర్తి ఆధిపత్యం చూపించాడు. జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్లో అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌తో తలపడనున్నాడు.
స్ట్రఫ్ పై విజయం తర్వాత, జొకోవిచ్ ప్రధాన వేదికపైకి వచ్చి ప్రేక్షకుల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు. "నాకు ఇంకా ఎన్ని మ్యాచ్ లు ఉంటాయో నాకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క ప్రత్యర్థి చాలా స్పెషల్. ఈ రాత్రి ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నేను గొప్ప ఆటతీరును కనబరిచాను". అని జొకోవిచ్ విజయం తర్వాత అన్నాడు. క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ ఫ్రిట్జ్ పై గెలిస్తే సెమీ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ తో ఆడే అవకాశం ఉంది.