పులులు పెరిగినయా? తగ్గినయా?

పులులు పెరిగినయా? తగ్గినయా?

మంచిర్యాల, వెలుగు: దేశవ్యాప్తంగా పులుల గణనకు రంగం సిద్ధమైంది.  డిసెంబర్​, జనవరి నెలల్లో ఐదో విడత గణనకు సంబంధించి తెలంగాణలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఫారెస్ట్​ ఆఫీసర్లకు, స్టాఫ్​కు దశలవారీగా ట్రెయినింగ్​ ఇచ్చారు. పులుల ఆవాసాలను గుర్తించి అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే సీసీ కెమెరాల ద్వారా శాస్ర్తీయ పద్ధతిలో పులుల లెక్క తేల్చనున్నారు. నేషనల్​ టైగర్​ కన్జర్వేషన్​ అథారిటీ (ఎన్​టీసీఏ) ఆధ్వర్యంలో ప్రతి నాలుగేండ్లకోసారి పులుల గణన చేపడుతున్నారు. ఇప్పటివరకు నాలుగుసార్లు గణన నిర్వహించగా, 2018లో చివరిసారిగా జరిగింది. 2014లో అప్పటి ఉమ్మడి ఏపీలో 68 పులులు ఉండగా, 2018 నాటికి వీటి సంఖ్య 74కు చేరింది. ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నట్టు ఎన్​టీసీఏ ప్రకటించింది. ఈసారి పులుల సంఖ్య పెరుగుతుందా? తగ్గిందా? అనేది ఆసక్తికరంగా మారింది. 

పులుల లెక్కింపు ఇలా..

ఎన్​టీసీఏ గైడ్​లైన్స్​ ప్రకారం ఆయా రాష్ర్టాల్లో ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో పులుల లెక్కింపు చేపడుతారు. చిరుతలు, అడవి కుక్కలు, అడవి పిల్లులు, తోడేళ్లు, నక్కలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులతో పాటు శాఖాహార జంతువుల సంఖ్యను కూడా అంచనా వేస్తారు. దేశవ్యాప్తంగా 45వేల ఫారెస్ట్​ బీట్లు ఉండగా, ప్రతి బీట్​ను యూనిట్​గా తీసుకొని గణన నిర్వహిస్తారు. మన రాష్ర్టంలోని అడవులను 12 సర్కిల్స్​గా విభజించారు. అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​ పరిధిలో ఆరు, కవ్వాల్​ టైగర్​ రిజర్వ్​ పరిధిలో మరో ఆరు సర్కిల్స్​ ఉండగా, మొత్తం 3,038 ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ బీట్లు ఉన్నాయి. ప్రతి బీట్​లో ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున సుమారు తొమ్మిది వేల మంది గణనలో పాల్గొంటారని ఆఫీసర్లు తెలిపారు. పులుల ఆవాసాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకే వారంలో పులుల లెక్కింపు చేపడుతారు. మొదటి మూడు రోజులు ఐదు కిలోమీటర్ల దూరం నడుస్తూ పులుల పాదముద్రలు, మలం పెంటికలు, మూత్ర విసర్జన, రాలిపడిన వెంట్రుకలు, తిని వదిలిన కళేబరాలు, చెట్లపై, నేలపై గోర్లతో గీసిన గుర్తులు, అరుపులు, ప్రత్యక్షంగా చూడటం చేస్తారు. సీసీ కెమెరాల్లో టాప్​ చేసిన డేటాను ‘వైల్డ్‌‌‌‌‌‌‌‌లైఫ్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌’లో నమోదు చేస్తారు. నాలుగు, ఐదు, ఆరు రోజుల్లో ఒకే మార్గంలో రెండు కిలోమీటర్లు వెళ్తూ 15 చదరపు మీటర్ల సర్కిల్‌‌‌‌‌‌‌‌లో శాకాహార జంతువులను గణిస్తారు. 15 మీటర్ల విస్తీర్ణంలో చెట్ల ఒత్తిడి, మనుషుల సంచారం, పొదల జాతులు, గడ్డిజాతులు, పశువుల సంచారం, ఆవాస సంరక్షణ, చెట్ల నరికివేత, భూ ఆక్రమణల వంటి అంశాలను సేకరిస్తారు. శాఖాహార జంతువుల సంఖ్యను ఎన్టీసీఏ ఫార్మాట్​లో రికార్డ్​ చేస్తారు. ఈ ఆరు రోజుల్లో సేకరించిన వీడియోలు, ఫొటోలు, ఇతర సమాచారాన్ని ఏడోరోజు ‘వైల్డ్‌‌‌‌‌‌‌‌లైఫ్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌’లో నమోదు చేసి డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌లోని ఎన్​టీ​సీఏకు పంపిస్తారు. అన్నిరాష్ర్టాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి పులుల సంఖ్యను నిర్ధారిస్తారు.  

దేశంలో 3 వేలకు పైగా.

2018లో నిర్వహించిన నాలుగో విడత జాతీయ పులుల గణన ప్రకారం దేశవ్యాప్తంగా 2,967 పులులు ఉన్నట్టు లెక్క తేల్చారు. సంబంధిత రిపోర్ట్​ను  ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2020లో రిలీజ్​ చేశారు. దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు పులుల సంతతికి ప్రపంచంలోనే సురక్షితమైన ఆవాసంగా భారత్‌‌‌‌‌‌‌‌లోని అడవులు మారాయని ఈ నివేదిక వెల్లడించింది. 2006లో దేశంలో 1,411 పులులు ఉండగా, 2010లో వాటి సంఖ్య 1,706కు చేరింది. 2014లో 2,226 ఉండగా, 2018 నాటికి 2,967కు చేరడం విశేషం.

రాష్ట్రంలోకి పెరిగిన పులుల వలసలు

2014లో ఉమ్మడి ఏపీలో 68 పులులు ఉండగా, 2018 నాటికి వీటి సంఖ్య 74కు చేరింది. ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నట్టు ఎన్​టీసీఏ ప్రకటించింది. ఐదారేండ్లుగా రాష్ట్రంలో పులుల సంఖ్య బాగా పెరిగిందని సమాచారం. ముఖ్యంగా కవ్వాల్​ టైగర్​ జోన్​ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోకి పొరుగునున్న మహారాష్ట్ర నుంచి పులుల వలసలు పెరుగుతున్నాయి. తిప్పేశ్వర్​, తడోబా అభయారణ్యాల్లో పులుల సంతతి పెరగడంతో కొత్త ఆవాసాలను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నాయని ఆఫీసర్లు నిర్ధారిస్తున్నారు. 2016లో తడోబా నుంచి కాగజ్​నగర్​ డివిజన్​కు వలస వచ్చిన ఫాల్గుణ అనే ఆడపులి కడంబా ఏరియాలో ఆవాసం ఏర్పర్చుకుంది. రెండు ఈతల్లో ఎనిమిది కూనలను పెట్టింది. ప్రస్తుతం ఫాల్గుణ, దాని సంతానమైన కే4 పులుల జాడలేదు. కొన్ని నెలల కింద మరో పులి 2కూనలతో సంచరిస్తూ సీసీ కెమెరాల్లో చిక్కింది. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలైన ఆసిఫాబాద్​, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో నిత్యం పులుల ఉనికి కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లోనే సుమారు 15 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.