రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం..దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే:ఎన్వీ సుభాశ్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం..దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే:ఎన్వీ సుభాశ్

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీని పదే పదే దుర్భాషలాడటం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందనీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న రాహుల్ గాంధీ.. ప్రధానిని దేశద్రోహి అని సంబోధించడం ఆయన అహంకారానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. బుధవారం బీజేపీ స్టేట్ఆఫీసులో ఎన్వీ సుభాశ్ మీడియాతో మాట్లాడారు.

ఓబీసీ ప్రధాని కావడాన్ని గాంధీ కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. మోదీని గతంలో మౌత్ కా సౌదాగర్ అని తిట్టారని గుర్తుచేశారు. ఇప్పటివరకు 90 సార్లకు పైగా అవమానించారని, 99 సీట్లు వచ్చిన నిరాశ, నిస్పృహల్లోనే రాహుల్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసినందుకు, ప్రజలచే ఎన్నికైన ప్రధానిని అవమానించినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఎన్వీ సుభాశ్  డిమాండ్ చేశారు.