హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకార తేదీలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 2025, డిసెంబర్ 20కి బదులు 22వ తేదీన కొత్త సర్పంచుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. డిసెంబర్ 20న ముహూర్తాలు బాగోలేవంటూ ప్రజా ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున వినతుల రావడంతో ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గాలు కొలువు దీరేందుకు 2025, డిసెంబర్ 20న ప్రభుత్వం మొదట ముహుర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల తొలి సమావేశం నిర్వహించడంతో పాటు నూతన సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించింది.
కానీ డిసెంబర్ 20న ముహుర్తాలు బాగోలేవని.. ప్రమాణ స్వీకార తేదీ మార్చాలంటూ ప్రభుత్వానికి పలువురు ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు డిసెంబర్ 20కి బదులు 22వ తేదీన కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. డిసెంబర్ 11న ఫస్ట్ ఫేజ్, డిసెంబర్ 14న సెకండ్ ఫేజ్, డిసెంబర్ 17న థర్డ్ ఫేజ్ పోలింగ్ జరిగింది. అక్కడకక్కడ చెల్లాచెదురు ఘటనలు మినహా మూడు దశల పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలక్షన్ కమిషన్, పోలీసులు పకడ్భందీగా ఏర్పాట్లు చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేశారు.
