మున్సిపాల్టీల్లో మాస్టర్ ప్లాన్ కు కసరత్తు

మున్సిపాల్టీల్లో మాస్టర్ ప్లాన్ కు కసరత్తు
  • మొదటి దశలో  మూడు ఎంపిక
  • క్షేత్ర స్థాయి సర్వే ప్రారంభించిన  అధికారులు
  • నిర్మాణ అనుమతులు, పన్నుల వసూళ్ల లో  మార్పులు
  • మున్సిపాల్టీల్లో గృహ, కమర్షియల్​ జోన్ల ఏర్పాటు

సిద్దిపేట, వెలుగు: జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాల్టీల్లో గత కొంత కాలం పెండింగ్ లో ఉన్న మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారులు దృష్టి సారించారు.    ఇటీవలే డీటీసీపీ ( డైరక్టరేట్ ఆఫ్​ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ) సర్వే చేశారు. గజ్వేల్​లో డీటీసీపీ అడిషనల్ డైరక్టర్ రమేశ్​​ బాబు, దుబ్బాకలో డిప్యూటీ డైరక్టర్ రవీంద్ర  బేసిక్ మ్యాపులతో పట్టణాలను పరిశీలించారు. జిల్లాలో చేర్యాల మినహా మిగిలిన మూడు మున్సిపాల్టీల్లో మాస్టర్ ప్లాన్ సన్నాహాలను ప్రారంభించారు. రాబోయే యాభై ఏండ్ల కు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ఉంటుందని అధికారులు అంటున్నారు.  ప్రస్తుతం ప్రాథమిక సర్వే పనులు ప్రారంభం కాగా రానున్న రోజుల్లో మరిన్ని సర్వేలు  నిర్వహించి,  మాస్టర్ ప్లాన్ ను పనులను మరింత వేగవంతం చేసే అవకాశాలున్నాయి.

సమగ్ర అభివృద్ధిపై మ్యాప్

మాస్టర్ ప్లాన్ ను అమలు చేసే మూడు మున్సిపాల్టీలను అభివృద్ధి చేయడం కోసం కన్సల్టెన్సీ తయారు చేసిన బేసిక్ మ్యాప్ ప్రకారం పరిశీలన జరుపుతున్నారు. రోడ్లు, చెరువులు, కుంటలు, కాల్వలు, అటవీ ప్రాంతం, గ్రామాల హద్దులు, సర్వే నెంబర్ల తో అన్ని శాఖల సమన్వయంతో   ప్లాన్ అమలుకు అడుగులు పడుతున్నాయి. మాస్టర్ ప్లాన్ లో భాగంగా అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ, రింగ్ రోడ్ల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరుస్తూ తగిన చర్యలు చేపడతారు. 

ఆదాయ వనరుల పెంపుపై దృష్టి

మున్సిపాల్టీల్లో మాస్టర్ ప్లాన్ అమలు లో భాగంగా ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ప్రస్తుతం గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ మున్సిపాల్టీల నుంచి మొత్తం ఏడాదికి రూ. 6.30 కోట్లు పన్నుల రూపంలో ఆదాయం వస్తోంది. మాస్టర్ ప్లాన్ అమలుతో ఈ ఆదాయాన్ని మరింత పెంచాలనే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. డొమెస్టిక్, కమర్షియల్ టాక్స్ లను ఖచ్చితంగా వసూలు చేయాలని నిర్ణయించారు. కొందరు డొమెస్టిక్ పేరుతో ఇండ్లను కట్టి దుకాణాలను ఏర్పాటు చేయడం వల్ల మున్సిపాల్టీల ఆదాయానికి గండి పడుతోందని గుర్తించారు. ఇలాంటి వాటిని కమర్షియల్ కేటగిరీలోకి మార్చడం వల్ల  ఆదాయం పెరగనున్నదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ టాక్స్ కింద స్క్వేర్​ మీటర్ కు రూ. 10, కమర్షియల్ కేటగిరిలో  స్క్వేర్​  మీటర్ కు రూ. 35  వసూలు చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ అమలు ప్రారంభమైతే ఆయా మున్సిపాల్టీల్లో ప్రత్యేక జోన్లు  ఏర్పాటై ఆదాయం పెరుగుతుంది. డొమెస్టిక్, కమర్షియల్, అగ్రికల్చర్, ఇండస్ట్రీయల్, ఎడ్యుకేషన్ జోన్ల ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ అమలుతో మార్గం సుగమం కానున్నది.

పటిష్టంగా  అమలు 

మున్సిపాల్టీల్లో మాస్టర్ ప్లాన్ ను పూర్తి స్థాయిలో అమలు చేస్తే నిబంధనలు మరింత పటిష్టంగా అమలు చేసే అవకాశం ఏర్పడుతుంది. కొత్తగా నిర్మించే ఇండ్ల విషయంలో సెట్ బ్యాక్ పాటించడంతో పాటు రోడ్డు వెడల్పు నిబంధనలు కచ్చితంగా అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మాస్టర్ ప్లాన్ అమలు లోకి వస్తే జోన్ల ప్రకారం పన్నులను వసూలు చేస్తారు. కమర్షియల్ జోన్ల లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా పన్నులు అదే కేటగిరిలో వసూలు చేస్తారు. దీని వల్ల మున్సిపాల్టీల ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి.

సమగ్ర అభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్

మున్సిపాల్టీల సమగ్ర అభివృద్ధి తో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టి లో ఉంచుకుని   మాస్టర్ ప్లాన్ కు రూప కల్పన చేస్తున్నాం. రోడ్ల విస్తరణతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచడం,  ఇంటి నిర్మాణ అనుమతులతో పాటు, పన్నుల వసూళ్ల లో  కొన్ని మార్పులు చేస్తాం. మాస్టర్ ప్లాన్ అమలు వల్ల మున్సిపాల్టీల్లో ఆదాయం పెరగడంతో పాటు  ఇల్లీగల్ నిర్మాణాలు జరిగే అవకాశం వుండదు. దుబ్బాక, గజ్వేల్ మున్సిపాల్టీల్లో క్షేత్ర స్థాయి పరిశీలనను పూర్తి చేశాం. - పి.గణేష్​ రెడ్డి, కమిషనర్, దుబ్బాక ఇన్​చార్జి గజ్వేల్ మున్సిపాల్టీ )