ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరు

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరు
  • ఏండ్లుగా జనావాసాల మధ్యే నిర్వహణ
  • ఇబ్బందులు పడుతున్న స్థానికులు
  • సర్కిల్ కి రెండు పెంచుతామని చెప్పి మరిచిన నాయకులు 

హైదరాబాద్, వెలుగు:  సిటీలో చెత్త తరలింపు కేంద్రాల వద్ద  కంపు పుడుతోంది.  గతంలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసిన సమయంలో ఇండ్లు లేకపోవడం, ఆ తర్వాత ఒక్కొక్కటిగా నిర్మాణాలు జరగడంతో ప్రస్తుతం చెత్త తరలింపు కేంద్రాల చుట్టుపక్కల అంతటా దుర్వాసన ఎక్కువైంది. యూసుఫ్ గూడలో  ట్రాన్స్​ ఫర్​ స్టేషన్​తో చాలా కాలనీల్లోని జనం ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయంపై బల్దియాకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. లోయర్ ట్యాంక్ బండ్​లో ఉన్న చెత్త తరలింపు కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో భరించలేని కంపు వస్తోందని స్థానిక జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కన ఉన్న ఇందిరా పార్కుతో పాటు  కాలనీల్లో  కూడా చెత్త వాసన వస్తుందంటున్నారు.  కొన్ని కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ సరిపడా స్టాఫ్​ను అందుబాటులో  ఉంచడం లేదు. దీంతో చెత్తను ఖాళీ చేసేందుకు వచ్చిన స్వచ్ఛ ఆటోలు వెయిట్ చేయాల్సి వస్తోంది. గ్రేటర్​లో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను  తరలించాల్సిన కేంద్రాలు సరిపడా లేవు. కేవలం 17 కేంద్రాలతో పాటు 24 సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్​పోర్టు పాయింట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు 72 రిఫ్యూ కంపాక్ట్​ వెహికల్స్​తో(గార్బేజ్ ట్రక్కులు) చెత్తను కలెక్ట్​ చేసుకొని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు.  

సర్కిల్​కు రెండు ఒట్టి మాటేనా?

జనాలతో పాటు స్వచ్ఛ ఆటో డ్రైవర్లు త్వరగా కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైతే సర్కిల్​కు రెండు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మేయర్ ప్రకటించారు. కానీ ఆ అంశంపై దృష్టి పెట్టడం లేదు. చెత్త తరలింపు కేంద్రాల వద్ద స్వచ్ఛ ఆటో డ్రైవర్లు గంటల తరబడి నిలబడి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని జియాగూడలో ఇటీవల  పలువురు ఆందోళన సైతం చేశారు.  ‘డస్ట్ బిన్ లెస్’ సిటీ అంటూ  గొప్పలుహైదరాబాద్ నగరాన్ని డస్ట్ బిన్ లెస్ సిటీగా చేశామని ప్రభుత్వం ఎన్నో  గొప్పలు చెబుతోంది. కానీ సిటీలో ఎక్కడ చూసిన చెత్తనే  కనిపిస్తోంది. రోడ్లపై ఉన్న డస్ట్​బిన్లను తొలగించడంతో జనం ఎక్కడపడితే అక్కడే చెత్తను పారేస్తున్నారు.  ఎప్పటికప్పుడు చెత్తను తరలింపు కేంద్రాలకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవడం వల్ల దుర్వాసన నిండి ఉన్న డస్ట్ బిన్ల సంఖ్య తగ్గిందని సర్కార్ గొప్పలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 

దుర్వాసనతో నిలబడలేకపోతున్నం..

లోయర్ ట్యాంక్ వద్ద సిగ్నల్ పడిన కొద్దిసేపు కూడా అక్కడ నిలబడలేకపోతున్నం. డంపింగ్ యార్డు నుంచి కంపు రాకుండా చర్యలు తీసుకోవాలె. పార్కు వెనుక భాగంలో కూడా వాసన వస్తోంది. కొత్త టెక్నాలజీతో పూర్తిగా దుర్వాసన రాకుండా చూడాలి.  

- సుదర్శన్, గాంధీనగర్

అన్ని చర్యలు తీసుకోవాలి...

చెత్త తరలింపు కేంద్రాల వద్ద కొత్త టెక్నాలజీతో అసలు దుర్వాసన రాకుండా చేస్తామని అధికారులు అంటున్నారు. కానీ పనులు మాత్రం వేగంగా చేయడం లేదు. ఒక్కోసారి ఎక్కువ కంపు కొడుతోంది. వాసన రాకుండా చర్యలు తీసుకోకపోతే ఇక్కడి నుంచి కేంద్రాన్ని తరలించండి.

- శ్రీనివాస్, యూసుఫ్​గూడ