మదర్ థెరిసా చారిటీ బ్యాంక్​ ఖాతాలు ఫ్రీజ్​!

మదర్ థెరిసా చారిటీ బ్యాంక్​ ఖాతాలు ఫ్రీజ్​!
  • ఎఫ్​సీఆర్ఏ రిజిస్ట్రేషన్ నే రిజెక్ట్ చేశామన్న కేంద్రం
  • బ్యాంక్  అకౌంట్లు పనిచేస్తున్నాయన్న చారిటీ

న్యూఢిల్లీ: మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్​చారిటీ సంస్థ బ్యాంక్ అకౌంట్లను కేంద్రం ఫ్రీజ్ చేసిందంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, క్రైస్తవ మతపెద్దలు చేసిన ప్రకటనలతో దుమారం రేగింది. 

ఉదయం: మమతా బెనర్జీ ట్వీట్​

దేశంలో ఆ చారిటీకి ఉన్న అన్ని బ్యాంకు అకౌంట్లను కేంద్ర హోంశాఖ క్రిస్మస్ రోజు నిలిపివేసిందని, దీంతో 22 వేల మంది పేషెంట్లు, చారిటీ ఉద్యోగులు తిండి, మందులు లేక అలమటిస్తున్నారంటూ మమత సోమవారం ట్వీట్ చేశారు. కలకత్తా క్రైస్తవ మత పెద్ద ఫాదర్ డొమినిక్ గోమ్స్, క్యాథలిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యాంజెలినా జస్నానీ కూడా చారిటీ అకౌంట్లను కేంద్రం ఫ్రీజ్ చేయడం దారుణమంటూ స్పందించారు. అయితే, తమ బ్యాంక్ అకౌంట్లను కేంద్రం ఫ్రీజ్ చేయలేదని, అన్ని అకౌంట్ల నుంచీ ట్రాన్సాక్షన్లు యథావిధిగా జరుగుతున్నాయని చారిటీ అధికార ప్రతినిధి సునీతా కుమార్ వెల్లడించారు.

సాయంత్రం: ఫ్రీజ్​ చేయలేదన్న కేంద్రం

మదర్ థెరిసా చారిటీకి చెందిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేశారన్న మమత ప్రకటనను కేంద్ర హోం శాఖ సోమవారం సాయంత్రం ఖండించింది. చారిటీకి చెందిన ఎలాంటి అకౌంట్లనూ నిలిపివేయలేదని స్పష్టం చేసింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్ సీఆర్ఏ) కింద రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం పెట్టుకున్న అప్లికేషన్​ను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. విదేశాల నుంచి విరాళాలను పొందేందుకు దేశంలోని ఎన్జీవోలు తప్పనిసరిగా ఎఫ్​సీఆర్ఏ, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రూల్స్(ఎఫ్​సీఆర్ఆర్)ను ఫాలో అవ్వాలని, రూల్స్​కు విరుద్ధంగా ఉన్నందుకే ఎఫ్ సీఆర్ఏ రిజిస్ట్రేషన్​ను తిరస్కరించామని పేర్కొంది.

చారిటీ వాళ్లే లేఖ రాసిన్రు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్​ ఇండియాలో ఉన్న తమ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలంటూ స్వయంగా మదర్ థెరిసా చారిటీ వాళ్లే బ్యాంకుకు లేఖ రాశారని కేంద్రం వెల్లడించింది. అయితే ఎస్బీఐ అకౌంట్ల ఫ్రీజ్ అంశంపై మాత్రం చారిటీ అధికారులు స్పందించలేదు.