Hyderabad Rains: హైదరాబాద్‌లో ఆగని వాన.. ఉదయం 6 నుంచే ఈ ఏరియాల్లో వర్షం

Hyderabad Rains: హైదరాబాద్‌లో ఆగని వాన.. ఉదయం 6 నుంచే ఈ ఏరియాల్లో వర్షం

హైదరాబాద్‌: హైదరాబాద్లో పలు చోట్ల మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీ, మాదాపూర్, షేక్ పేట్, బంజారాహిల్స్, యూసఫ్ గూడ సహా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే వర్షం మొదలైంది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, SR నగర్, ఎర్రగడ్డ, బోరబండ, సనత్ నగర్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. కూకట్పల్లి ఏరియాలో చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. మాదాపూర్లో రోడ్ల పైకి నీరు చేరుకుంది.

గ్రేటర్ సిటీలో మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది. పలుచోట్ల గాలులలో కూడిన వర్షం కురిసింది. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అవకాశం ఉంటే ఐటీ ఉద్యోగులు వర్క్  ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎంచుకోవడం బెటర్.

రానున్న రెండు, మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాలు, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.