సెంట్రల్ డెస్క్ : ఒకప్పుడు ఆయనకు తినడానికి తిండి కూడా లేదు. ఉండడానికి ఇల్లు లేదు. రైల్వే ప్లాట్ ఫాంలపై పడుకొని రోజులు వెళ్లదీశాడు. అలాంటి దుర్భర స్థితి నుంచి నేడు రూ.35,800 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఆయనే ‘సోలార్ గ్రూప్’ అధినేత సత్యనారాయణ్ నువాల్. రాజస్తాన్ లోని భిల్వారాలో ఓ మారుమూల గ్రామంలో ఆయన పెరిగారు. ఆయన తండ్రి ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగి. సత్యనారాయణ్కు చిన్నప్పటి నుంచి చదువుపై కన్నా వ్యాపారం చేయడంపైనే ఆసక్తి ఉండేది. పదో తరగతి అయిపోయాక చిన్న వ్యాపారాలు చేశారు. 18 ఏండ్ల వయసులో కెమికల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ స్థాపించారు. అయితే అది విజయంవంతం కాలేదు. తన 19వ ఏటే మహారాష్ట్రలోని చంద్రపూర్ లో పెండ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి 1977 వరకు కష్టాలు తప్పలేదు. కనీసం కుటుంబాన్ని పోషించుకునేందుకూ డబ్బులు లేవు. దీంతో ఆయన తరచూ రైల్వే స్టేషన్లలో పడుకున్నారు. అయినా ఆయన నిరాశ చెందలేదు. మేగజీన్లు, పేలుడు పదార్థాల (ఎక్స్ ప్లోజివ్స్) వ్యాపారం చేసే అబ్దుల్ సత్తాహ్ అల్లా భాయ్ అనే వ్యక్తిని సత్యనారాయణ్ అనుకోకుండా ఒకరోజు కలిశాడు. ఈ రంగంలో మంచి లాభం ఉందని, దేశంలో చాలినన్ని ఎక్స్ ప్లోజివ్స్ లేవని గుర్తించారు.
ఎక్స్ ప్లోజివ్ మేగజీన్లను అద్దెకు
సత్యానారాయణన్ నువాల్ 1970లో ఎక్స్ ప్లోజివ్ మేగజీన్లను అద్దెకు తీసుకున్నారు. బొగ్గు గనుల్లో పేలుడు పదార్థాలు వాడే కస్టమర్లకు మేగజీన్లు, పేలుడు పదార్థాలను అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. తర్వాత కన్ సైన్ మెంట్ ఏజెంట్ అయ్యారు. దేశంలోనే అతిపెద్ద ఎక్స్ ప్లోజివ్ డీలర్ గా ఎదిగారు. 1995లో సోలార్ పరిశ్రమలను స్థాపించారు. 65 దేశాల్లో కంపెనీకి బ్రాంచ్లు ఉన్నాయి. పేలుడు పదార్థాలు తయారుచేసి, డిఫెన్స్ ఇండస్ట్రీకి సరఫరా చేయడం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 29 శాఖలు ఏర్పడ్డాయి. టాంజానియా, దక్షిణాఫ్రికా,జాంబియా, ఘనా, నైజీరియాలో బిజినెస్ ను విస్తరించారు. ఇండియన్ ఆర్మీకి పేలుడు పదార్థాలు తయారుచేసి ఇచ్చేందుకు 2010లో కేంద్ర ప్రభుత్వం ఆయన కంపెనీకి లైసెన్స్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం నుంచి లైసెన్స్ అందుకున్న మొదటి ప్రైవేటు కంపెనీగా సోలార్ ఇండస్ట్రీస్ నిలిచింది. ప్రస్తుతం ఈ కంపెనీ పేలుడు పదార్థాల నుంచి గ్రనేడ్లు, డ్రోన్లు, వార్ హెడ్లు వంటి పరికరాలు తయారు చేస్తున్నది. 2012లో రూ.1765 కోట్లు ఉన్న ఈ కంపెనీ 2022 నవంబరులో రూ.35 వేల కోట్లకు ఎదిగింది. ఫోర్బ్స్ జాబితాలోనూ సత్యానారాయణ్ దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 72వ స్థానంలో నిలిచారు.
