ఆధార్‌కి మొబైల్ నంబర్ లింక్ చేయాలా ? ఈజీగా అప్‌డేట్ చేసుకునే పద్ధతులు ఇవే..

  ఆధార్‌కి మొబైల్ నంబర్ లింక్ చేయాలా ? ఈజీగా అప్‌డేట్ చేసుకునే పద్ధతులు ఇవే..

ఈ రోజుల్లో ప్రతి పనికీ ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, బ్యాంక్ పనులకైనా లేదా  వ్యక్తిగత వివరాలు అప్ డేట్ చేయడానికి, ఇతర అవసరాలకైనా ఇది తప్పనిసరి. ఒకవేళ మీ ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ లేకపోయినా లేదా పాత నంబర్ మార్చుకోవాలన్నా ఎం చేయాలో, ఎలా చేయాలో తెలుసా...

మొబైల్ నంబర్‌ను మొదటిసారి లింక్ చేయాలన్నా లేదా మార్చాలన్నా నేరుగా  ఆధార్ సర్వీస్ సెంటర్  వెళ్లడం తప్పనిసరి.  
 
మీ మొబైల్ నంబర్‌ ఆధార్‌తో లింక్ చేయాలంటే 
*మొదట మీ దగ్గరలోని  ఆధార్ సర్వీస్ సెంటర్ లేదా ఎన్రోల్మెంట్ సెంటరుకి వెళ్ళండి. 
*ఇప్పుడు ఆధార్ కరెక్షన్ ఫార్మ్ నింపండి.
*తరువాత అక్కడ ఉన్న అధికారులకు మీ ప్రస్తుత మొబైల్ నంబర్‌ను లింక్ చేయమని ఇవ్వండి. 
*వెరిఫికేషన్ కోసం మీ బయోమెట్రిక్ వివరాలను అంటే వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్ చేయండి.
*ఫీజు  (సుమారు రూ.50) చెల్లించి, మీ అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఉన్న రిసిప్ట్ స్లిప్‌ తీసుకోండి.

మొబైల్ నంబర్‌ అప్‌డేట్ చేయడానికి మరొక ఆఫ్‌లైన్ పద్ధతి పోస్ట్‌మ్యాన్ ద్వారా. ఈ సదుపాయం ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఈ సర్వీస్  వర్తిస్తుందని గమనించాలి. ఈ ప్రాంతాలలో, స్థానిక పోస్ట్‌మ్యాన్‌లు డిజిటల్ అప్‌డేట్‌ల కోసం ఎలక్ట్రానిక్ డివైజెస్  మీ వద్దకు తీసుకొస్తారు.

ప్రభుత్వ/ప్రభుత్వేతర సేవలు, సబ్సిడీలు, పెన్షన్, స్కాలర్‌షిప్‌లు, సామాజిక ప్రయోజనాలు, బ్యాంకింగ్, బీమా, పన్నులు, విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ మొదలైన వివిధ రకాల సేవల కోసం ఆధార్‌ను మరింత సులభంగా అందుబాటులోకి తెస్తున్నారు. అందువల్ల, ఆధార్ నంబర్ ఉన్న వ్యక్తికి సంబంధించిన డేటా CIDRలో ఖచ్చితంగా, ఎప్పటికప్పుడు అప్ డేట్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

గుర్తుంచుకోండి  ప్రస్తుతం మీ మొబైల్ నంబర్‌ను మీ ఆధార్ కార్డుకు ఆన్‌లైన్లో అనుసంధానించడానికి ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో లేవు.  ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా మీ నంబర్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, మీరు myAadhaar వెరిఫికేషన్ పేజీని ఉపయోగించి  స్టేటస్‌  చెక్ చేసుకోవచ్చు. 

ఆధార్‌ స్టేటస్ అప్ డేట్ కోసం 

*UIDAI అఫీషియల్ పోర్టల్‌ ఓపెన్ చేయండి 
*మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ ఎంటర్ చేయండి.
*మీ మొబైల్ నంబర్‌  ఎంటర్ చేయండి 
*'send OTP'  అండ్ 'submit' పై క్లిక్ చేయండి.
*లింక్ చేసినట్లయితే, ఆ నంబర్ యాక్టివ్‌గా ఉందని సూచించే మెసేజ్ మీకు వస్తుంది.
*మీకు ఏవైనా సందేహాలు ఉంటే, 1947 అనే టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు .