
- గుడాటిపల్లిలో రోజంతా ఉత్కంఠ
- మంత్రిని కలిసేందుకు బయలుదేరిన నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు
- కొందరు మాత్రమే వెళ్లాలంటూ కండిషన్
- చివరికి మంత్రి హరీశ్‌తో ప్రతినిధుల బృందం చర్చలు
- పలు ప్రతిపాదనలు చేసిన మంత్రి
- గ్రామస్తులతో చర్చించి తుది నిర్ణయం చెప్తామన్న ప్రతినిధులు
సిద్దిపేట, వెలుగు : న్యాయమైన పరిహారం కోసం గౌరవెల్లి నిర్వాసితులు చేపట్టిన ఆందోళన వరుసగా మూడో రోజు బుధవారం కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నేతల పరామర్శలు, పోలీసుల మోహరింపుతో గుడాటిపల్లిలో రోజంతా ఉత్కంఠ నెలకొంది. చివరికి మంత్రి హరీశ్‌రావుతో నిర్వాసితులు, కాంగ్రెస్ ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. చట్టబద్ధంగా రావాల్సిన పరిహారాలు ఇప్పిస్తానన్న మంత్రి.. 18 ఏండ్లు నిండిన యువతీయువకులకు ప్యాకేజీతోపాటు డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ముందుకు తెచ్చారు. వాటిపై గ్రామస్తులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రతినిధులు చెప్పి తిరుగుముఖం పట్టారు.
పార్టీల సంఘీభావం
హుస్నాబాద్‌లో మంగళవారం ధర్నా చేపట్టిన నిర్వాసితులపై పోలీసులు, టీఆర్ఎస్ వర్గాలు చేసిన దాడిలో పలువురు గాయపడగా.. ఇందుకు నిరసనగా నిర్వాసితులు బుధవారం గుడాటిపల్లిలో దీక్ష చేపట్టారు. బీజేపీ లీగల్, మెడికల్ సెల్ నేతలు గుడాటిపల్లి వద్ద నిర్వాసితుల దీక్షా శిబిరానికి చేరుకొని హుస్నాబాద్‌లో జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి చికిత్స అందించారు. అనంతరం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తరలివచ్చి నిర్వాసితులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు గంటకుపైగా వాళ్లతో చర్చించి, పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
నిర్వాసితులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలపై మంత్రి హరీశ్‌రావుతో ఫోన్లో మాట్లాడేందుకు కోదండరెడ్డి ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో నిర్వాసితులందరితో సిద్దిపేట వెళ్లి మంత్రిని కలవాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రెండు ట్రాక్టర్లలో నిర్వాసితులు, ప్రత్యేక వాహనాల్లో కాంగ్రెస్ నేతలు బయలుదేరగా సీపీ ఎన్.శ్వేత ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. గ్రామ శివార్లలో పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించి నిలువరించారు. ఈ సందర్భంగా అందరూ కాకుండా నిర్వాసితుల్లో ముఖ్యులు, కాంగ్రెస్ నేతలతో కూడిన ప్రతినిధుల బృందాన్ని మంత్రి హరీశ్‌రావు వద్దకు తీసుకెళ్లి, సమస్యను శాంతియుతంగా పరిష్కరిద్దామని సీపీ శ్వేత ప్రతిపాదించారు. దీంతో నిర్వాసితుల్లోంచి 10 మంది, కాంగ్రెస్ నేతలను 10 మందిని తీసుకొని ప్రత్యేక వాహనాల్లో పోలీసు ఎస్కార్ట్ మధ్య సిద్దిపేటకు తీసుకెళ్లారు.
కాంగ్రెస్ నేతల నిరసన
ప్రతినిధుల బృందం సిద్దిపేట చేరగానే మంత్రి హరీశ్‌రావు చిన్నకోడూరు మండలం మాచాపూర్ వద్ద ఉన్నారని, అక్కడే కలుద్దామని ఏసీపీ దేవారెడ్డి చెప్పడంతో వాహనాలను అటుతిప్పారు. కాగా, మంత్రి పబ్లిక్ మీటింగ్‌లో ఉన్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చర్చలకు పిలిచి అవమానించడమేనని తమ కాన్వాయ్ ను నిలిపి నిరసన తెలిపారు. దీంతో మంత్రి హరీశ్‌రావుతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయిస్తామని పోలీసులు సముదాయించడంతో మళ్లీ ప్రయాణం ప్రారంభించారు. మొత్తంమీద ప్రతినిధుల బృందం, మంత్రి హరీశ్‌రావు మెట్టుబండల వద్ద పంప్ హౌస్ ఆవరణలో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు.
పరిహారం అందిస్తాం: మంత్రి హరీశ్
నిర్వాసితులు, కాంగ్రెస్ నేతల బృందంతో మంత్రి హరీశ్‌రావు దాదాపు గంటకుపైగా చర్చించారు. చట్టబద్ధంగా రావాల్సిన అన్ని పరిహారాలను ప్రభుత్వం చెల్లిస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే, అడిషనల్ కలెక్టర్ తో ఒక కమిటీ వేస్తామన్నారు. 18 ఏండ్లు నిండిన వాళ్లకు ప్యాకేజీ ఇచ్చే విషయం చట్టపరిధిలో లేనందునే ప్రభుత్వం వాళ్లకు ప్లాట్ కేటాయించి ఇల్లు కట్టిస్తుందని తెలిపారు. ఇల్లు కట్టుకోవడం ఇష్టం లేని వాళ్లకు రూ. 3 లక్షల చొప్పున ఇస్తామని మంత్రి చెప్పారు. ప్లాట్లు ఇస్తామన్న స్థలాన్ని నిర్వాసితులు తిరస్కరించినందున ఆఫీసర్లతో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. ఆ స్థలంలో రోడ్లు , విద్యుత్, నీటి వసతి, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని, నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని ఆయన చెప్పారు. చైనా నుంచి మూడేండ్ల కింద తెచ్చిన మోటార్లను బిగించి ఈ నెలాఖరులోగా వాటి పనితీరును పరీక్షించాలని, మూడేండ్లు దాటిన తర్వాత మోటార్లు పనిచేయక పోతే సంబంధిత కంపెనీ బాధ్యత వహించదని మంత్రి అన్నారు. గడువు తీరిన తర్వాత మోటార్లకు రిపేర్లు అవసరమైతే కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని, దీని వల్ల ఆర్థికంగా భారం అవుతుందనే ఉద్దేశంతో గడువులోపు మోటార్లను నడిపించి పరీక్షించాలని నిర్ణయించి, ట్రయల్‌రన్‌కు సిద్ధమయ్యామని పేర్కొన్నారు. లాఠీచార్జ్ విషయాన్ని మంత్రి ముందు ప్రస్తావించగా.. సర్వే ఆఫీసర్లను అడ్డుకోవడం వల్లే ఈ ఘటన జరిగింది తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదని, కేవలం కొందరిని ముందస్తు అరెస్టు చేయడం కోసమే పోలీసులు వచ్చారని, కావాలని చేసింది కాదని వివరించే ప్రయత్నం చేశారు. కాగా, సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ... హుస్నాబాద్ ప్రాంతానికి సాగునీరు రావద్దనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. నిర్వాసితులతో ఎన్నిసార్లయినా చర్చించేందుకు, వారి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని, గతంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ పనులు కూడా అడ్డుకున్నాయని, పోలీసులపైకి రైతులు తిరగబడేలా రెచ్చగొట్టి ఆ తర్వాత తప్పుకున్నాయని దుయ్యబట్టారు.
అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
మంత్రి హరీశ్ రావు ప్రతిపాదనలపై నిర్వాసితులందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కేటాయించిన స్థలం నివాస యోగ్యం కాదు. అందుకే హుస్నాబాద్ మార్గంలో మాకు స్థలాలు కేటాయించాలని కోరుతున్నాం. ప్రభుత్వ భూమి దొరకకుంటే ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి ఇవ్వాలని అడిగాం. మిగిలిన పరిహారాల విషయంలో మంత్రి హామీ ఇచ్చారు.
- ఎం.రాజిరెడ్డి, సర్పంచ్ గుడాటిపల్లి
న్యాయం జరిగేదాకా నిర్వాసితుల వెంట ఉంటాం
నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా వాళ్ల వెంట ఉంటాం. అన్ని అంశాలపై మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడాం. కొన్ని సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించినా.. మరికొన్ని పెండింగ్ పడ్డాయి. ఆయన కొన్ని ప్రతిపాదనలు ముందుకు తెచ్చారు. దానికి నిర్వాసితుల అంగీకరించాల్సి ఉంది. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం తప్ప ఈ అంశాన్ని మేము రాజకీయం చేయదలచుకోలేదు.
- కోదండరెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు