వీధి కుక్క దాడిలో పసికందు మృతి నోయిడాలో దారుణం

వీధి కుక్క దాడిలో పసికందు మృతి నోయిడాలో దారుణం

లక్నో: ఉత్తరప్రదేశ్-లోని నోయిడాలో దారుణం జరిగింది. సోమవారం హౌసింగ్ కాంప్లెక్స్‌‌లో ఆడుకుంటోన్న ఏడు నెలల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు. సెక్టార్ 100లోని లోటస్ బౌలేవార్డ్ సొసైటీ ఆవరణలో చిన్నారిపై కుక్క దాడి చేసిందని నోయిడా ఏసీపీ రజనీశ్ వర్మ వెల్లడించారు. చిన్నారి తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులని.. దాడి సమయంలో వారు కూలీ పని చేస్తున్నారని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు.

అయితే, చిన్నారి మృతిపై తల్లిదండ్రులు, స్థానికులు సొసైటీ ఎదుట మంగళవారం ఉదయం నిరసన చేపట్టారు. వీధికుక్కల బెడదపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలపై స్పందించిన అధికారులు కుక్కల బెడదను తగ్గించడానికి రెసిడెన్షియల్ సొసైటీలు, డాగ్ షెల్టర్లతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. కుక్కల కోసం నాలుగు షెల్టర్ హోమ్‌‌లను ఏర్పాటు చేయనున్నట్లు  నోయిడా అథారిటీ స్పెషల్ ఆఫీసర్ ఇందు ప్రకాశ్ సింగ్ పేర్కొన్నారు.