బెట్టింగ్ వ్యసనం.. ఉప్పల్ లో సొంతింట్లోనే దొంగతనం..నగదు, నగలతో యువకుడు పరార్

బెట్టింగ్ వ్యసనం.. ఉప్పల్ లో సొంతింట్లోనే దొంగతనం..నగదు, నగలతో యువకుడు పరార్

ఉప్పల్, వెలుగు: ఆన్​లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన ఇంట్లోనే చోరీ చేసి, నగదు, నగలతో పారిపోయాడు. ఉప్పల్ హనుమసాయి నగర్​కు చెందిన ఎల్. శేఖర్ కొడుకు సంతోష్ (20) ఇంటర్ పూర్తి చేసి పైచదువులపై ఇష్టం లేక మధ్యలోనే ఆపేశాడు. తండ్రి కులవృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంతోష్ తండ్రి వద్ద దుకాణంలో పనిచేస్తూనే కొంతకాలంగా ఆన్​లైన్ బెట్టింగ్​లకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం తండ్రి బైక్​ను తాకట్టు పెట్టి రూ. 10 వేలు తెచ్చుకుని బెట్టింగ్​లో పెట్టాడు. 

ఈ నెల 4న కుటుంబ సభ్యులు బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లగా, ఇంట్లో దాచిన ఒక తులం బంగారు గొలుసు, చెవి కమ్మలు, రూ. 10 వేల నగదు తీసుకొని పరారయ్యాడు. కుటుంబ సభ్యులు కొడుకు కోసం గాలించినా ఫలితం లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.