- టైమ్ చాలక కొన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం చేయలేని పరిస్థితి
- పర్యటించాల్సిందిగా ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్‌ల నుంచి మంత్రులకు ఒత్తిళ్లు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మరో 48 గంటల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో రాష్ట్ర మంత్రులు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు తమ సొంత జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో ప్రచారానికి రావాలని మంత్రులకు స్థానిక నేతల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇదే సమయంలో ఒక్కో మంత్రికి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీ బాధ్యతలను కూడా సీఎం రేవంత్ రెడ్డి అప్పగించడంతో అక్కడి మున్సిపాలిటీల్లో ప్రచారానికి రావాలని లోకల్ లీడర్లు కోరుతున్నారు.
దీంతో మంత్రులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడగా, కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులు మాత్రం మంత్రుల ప్రచారంపైనే బోలెడంత ఆశలు పెట్టుకున్నారు. తమ డివిజన్లో, వార్డులో మంత్రి ఒక్కసారి ప్రచారం చేస్తే చాలు తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, క్యాడర్ లో ఫుల్ జోష్ వస్తుందనే భావనలో పలువురు పోటీదారులు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు తమ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ లు, డీసీసీ అధ్యక్షుల ద్వారా మంత్రులపై ఒత్తిడి తీసుకువస్తూ ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు.
ఈసారి ప్రచారానికి తక్కువ రోజులే ఉండడం, సొంత జిల్లాల్లో పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయడం, అటు సీఎం అప్పగించిన పార్లమెంట్ స్థానాల పరిధిలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సి రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రులు ప్రచారం చేసినా ఇంకా కవర్ చేయాల్సిన మున్సిపాలిటీలు చాలా ఉండడంతో ఇక తాము రాలేమని చేతులు ఎత్తేస్తున్నారు.
ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలను, డీసీసీ చీఫ్‌లను, నియోజకవర్గ ఇన్చార్జ్ లనే ప్రచారంలో పాల్గొనాలని మంత్రులు సూచిస్తున్నారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, సీతక్క వంటి మంత్రులు రోజుకు దాదాపు 12 నుంచి 14 గంటల వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా.. అన్ని మున్సిపాలిటీలను చుట్టి రావడం సాధ్యపడడం లేదు.
బీజేపీ, బీఆర్ఎస్లోనూ ఇదే పరిస్థితి
బీజేపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఆ పార్టీకి కిషన్ రెడ్డి, బండి సంజయ్.. ఇద్దరు కేంద్ర మంత్రులే ఉండడంతో అన్ని మున్సిపాలిటీలకు వెళ్లడం సాధ్యపడడం లేదు, బండి సంజయ్ మాత్రం తన పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ కార్పొరేషన్ పైనే ప్రత్యేక దృష్టిపెట్టారు.. కిషన్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు, సీఎంలు ప్రచారం కోసం రాష్ట్రానికి వచ్చినా.. ప్రచార సభల్లో మాత్రమే పాల్గొంటున్నారు.
డివిజన్లలో ప్రచారం చేయడం లేదు. ఇక బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీశ్ వంటి వారు ప్రచారానికి రావాలని అభ్యర్థుల నుంచి ఎన్ని విన్నపాలు వచ్చినా కేటీఆర్ సిరిసిల్లలో, హరీశ్ గజ్వేల్, ప్రజ్ఞాపూర్లకే పరిమితం అయ్యారు.
