- బీసీజీ, పోలియో, డీటీపీ, మీజిల్స్ టీకాలు పూర్తిగా అందడం లేదు
- ఇంటర్నేషనల్ టార్గెట్ 90 శాతం, రాష్ట్ర సగటు 69.6 శాతం
- ధనికులతో పోలిస్తే పేద పిల్లలు, ఆడబిడ్డలకే ఎక్కువ నష్టం
- వైద్య నిపుణుల పరిశోధనలో విస్తుపోయే నిజాలు
హైదరాబాద్, వెలుగు: చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడాల్సిన వ్యాక్సినేషన్లో అసమానతలు బయటపడ్డాయి. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఫీల్డ్ ప్రాక్టీస్ ఏరియా పరిధిలోని అర్బన్, రూరల్ ఏరియాల్లో 12 నుంచి 23 నెలల వయసున్న పిల్లల్లో కేవలం 57.0 శాతం మందికి మాత్రమే పూర్తిస్థాయి టీకాలు అందినట్లు రీసెర్చ్‌లో వెల్లడైంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన 90 శాతం లక్ష్యం అటుంచితే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 ప్రకారం రాష్ట్ర సగటు 69.6 శాతంగా ఉండగా, ఈ ప్రాంతంలో మాత్రం 57 శాతానికే పరిమితమైంది. గాంధీ, ఉస్మానియా ప్రభుత్వ మెడికల్ కాలేజీల డాక్టర్లు సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్ మెడికల్ కాలేజీల నిపుణులతో కలిసి నిర్వహించిన ఈ కమ్యూనిటీ బేస్డ్ స్టడీ వివరాలు ఇటీవల క్యురియస్ మెడికల్ జర్నల్‌లో వెలువడ్డాయి.
400 మంది చిన్నారుల వివరాలతో..
ఉస్మానియా ఫీల్డ్ ప్రాక్టీస్ ఏరియా పరిధిలోని 10 స్లమ్స్, 10 గ్రామాల నుంచి 400 మంది చిన్నారులను రాండమ్ సాంప్లింగ్ పద్ధతిలో సెలెక్ట్ చేసి 2023 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య ఈ సర్వే నిర్వహించారు. ప్రభుత్వ మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ (ఎంసీపీ) కార్డులు, అంగన్వాడీ సెంటర్ల రికార్డులను పరిశీలించారు. ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారం ఒక డోస్ బీసీజీ, మూడు డోసుల పోలియో (ఓపీవీ), మూడు డోసుల డీటీపీ, ఒక డోస్ మీజిల్స్ తీసుకున్నవారినే పూర్తి టీకాలు పొందినవారీగా లెక్కించారు. ఈ 400 మందిలో 57.0 శాతం మందికే అన్ని టీకాలు అందగా, మిగిలిన 43.0 శాతం మందికి అసంపూర్తిగా అందాయి. మరోవైపు సంపన్న కుటుంబాల్లోని పిల్లల్లో 67.86 శాతం, పేద కుటుంబాల్లో కేవలం 43.18 శాతం మందికే టీకాలు అందడం గమనార్హం.
ఊర్లో కంటే సిటీ బస్తీల్లోనే దారుణం..
పెద్ద దవాఖానలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానలు ఉండే సిటీల్లో వ్యాక్సినేషన్ బాగుంటుందనుకోవడం భ్రమేనని రీసెర్చ్ తేల్చింది. గ్రామీణ ప్రాంతంలో ధనిక, పేద తేడా లేకుండా సగటున 49 శాతం కవరేజ్ నమోదైంది. కానీ సిటీకి వచ్చేసరికి సంపన్నుల్లో 83.72 శాతం మందికి టీకాలు అందితే, పేద బిడ్డల్లో కేవలం 30.99 శాతం మందికే పూర్తి టీకాలు అందాయి. మగ పిల్లల్లో 61.95 శాతం మందికి పూర్తి టీకాలు లభించగా, ఆడపిల్లల్లో 50.57 శాతానికే అందాయి. సంపన్న వర్గాల ఆడపిల్లల్లో 64.71 శాతం రక్షణ ఉంటే, పేద వర్గాల ఆడపిల్లల్లో కేవలం 30.56 శాతం మందికే పూర్తి టీకాలు అందాయి. అంటే పేద బస్తీల్లోని దాదాపు 70 శాతం ఆడబిడ్డలకు ప్రాథమిక రక్షణ దక్కడం లేదు.
వ్యవస్థాగత లోపాలే అసలు కారణం..
వ్యాక్సినేషన్లో ధనిక-పేద అంతరాలకు తల్లి వయసు, చదువు, మతం, ప్రాంతం, పిల్లల లింగం వంటి కారణాల వాటా కేవలం 7.9 శాతం మాత్రమేనని మోడల్ విశ్లేషణలో తేలింది. మిగిలిన 92.1 శాతం అంతరానికి గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్‌లోని సప్లై సైడ్ లోపాలు, వ్యాక్సిన్ సెంటర్ల పనివేళలు పేదలకు అనుకూలంగా లేకపోవడం, రోజువారీ కూలీ చేసుకునే తల్లులకు పనులు నష్టపోవడం, రవాణా ఇబ్బందులు, సిబ్బంది పర్యవేక్షణ లోపమే కారణమై ఉండవచ్చని రీసెర్చర్లు భావిస్తున్నారు. ఈ అసమానతలను అధిగమించాలంటే ప్రభుత్వ హెల్త్ సప్లై సిస్టమ్‌ను బలోపేతం చేయాలని సూచించారు. అర్బన్ స్లమ్స్, పేద ఆడపిల్లలను అత్యంత ప్రాధాన్యతా వర్గాలుగా గుర్తించి స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టాలని పేర్కొన్నారు. సాయంత్రం వేళల్లో టీకా సెంటర్లు నడపడం, మొబైల్ టీమ్స్ ద్వారా బస్తీల్లోకి నేరుగా వెళ్లి సేవలు అందించి, డ్రాప్ అవుట్ అయిన పిల్లలను ట్రాక్ చేస్తేనే వంద శాతం లక్ష్యాన్ని సాధించవచ్చని రీసెర్చర్లు స్పష్టం చేశారు.
