వరి.. ఉరి: సీఎం కామెంట్ల​పై ప్రతిపక్షాల ఫైర్​

వరి.. ఉరి: సీఎం కామెంట్ల​పై ప్రతిపక్షాల ఫైర్​

‘వరి వేస్తే ఉరేసుకున్నట్టే’ అని సీఎం కేసీఆర్​ చేసిన కామెంట్ల​పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వరి సాగు వద్దంటున్న సీఎం.. ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారని ప్రశ్నిస్తున్నాయి. వరి సాగు చేస్తున్న 90 శాతం రైతులు ఎటుపోవాలని నిలదీస్తున్నాయి. ధాన్యం ఉత్పత్తి, వరి సాగులో ముందున్నామని గొప్పలు చెప్పుకుంటూనే.. వరి సాగు చేయొద్దంటూ సీఎం చేసిన ప్రకటన రైతుల్లోనూ గందరగోళానికి కారణమవుతోంది.

రైతుల ఆత్మహత్యలకు సీఎందే బాధ్యత
రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌‌‌‌దే. ‘వరి వేస్తే ఉరే’ అని సీఎం చేసిన వ్యాఖ్యలతో ఆందోళన చెంది ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.                                                                                                  ‑ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్

వరి వద్దంటే మరి ప్రాజెక్టులెందుకు?
నదుల మీద నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు చెప్పారు.  ఇప్పుడు ‘వరి వేస్తే ఉరి’ అంటే ఎలా? మరి కొత్త ప్రాజెక్టులు ఎందుకు కట్టారు?                                                                                                           ‑ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

 

వడ్లు కొనడం మా బాధ్యత కాదు
కేంద్రమే కొనుగోలు చేయాలి: మంత్రి గంగుల

కరీంనగర్ టౌన్, వెలుగు: ధాన్యం కొనుగోలు, రవాణా బాధ్యత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానిది కాదని.. కేంద్రానిదేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పంటల్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు. పంజాబ్‌‌‌‌లో రైతులు పండించిన పంటనంతా కొనుగోలు చేస్తున్న కేంద్రం.. తెలంగాణలో పంటల్ని కొనుగోలు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. మంగళవారం క్యాంప్ ఆఫీస్ లో గంగుల మీడియాతో మాట్లాడారు. వర్షాకాలంలో 1.45 కోట్ల టన్నుల పంట వస్తే.. కేంద్రం 60 లక్షల టన్నులు కొన్నదని, మిగతా పంట మాటేంటని ప్రశ్నించారు.
ఏమైనా చేసుకోండి.. కానీ.. మీరే కొనండి
‘‘ఎండాకాలంలో వచ్చే వడ్లను బాయిల్డ్ రైస్ గా మార్చితే ఆ పంటను కిలో కూడా కొనుగోలు చేయబోమని కేంద్ర మంత్రి పీయూష్‍ గోయల్ చెప్పారు. యాసంగి, వానకాలంలో పండించే ధాన్యాన్ని కేంద్రమే కొనాలి. ప్రజలకు ఉచితంగా ఇస్తారో.. విదేశాలకు ఎగుమతి చేస్తారో.. కానీ సామాజిక బాధ్యతగా కేంద్రం ఒక్క గింజను కూడా వదలకుండా కొనుగోలు చేయాలి. తెలంగాణ రైతులను కాపాడాలి” అని గంగుల కోరారు. సీఎం దూరదృష్టితో రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చుకు వెనకాడకుండా కాళేశ్వరం నీళ్లు అందించారని గుర్తు చేశారు. ఉచిత కరెంట్‌‌‌‌తో వరి ధాన్యం ఎగుమతి పెరిగిందన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రం ముందే చెప్పి ఉంటే.. పంటను మార్చుకునే వాళ్లమన్నారు. ఇదే పరిస్థితి 2001లో ఉత్పన్నమైతే అప్పటి పీఎం వాజ్ పేయి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని రాష్ట్రంలో పండించే ధాన్యాన్నంతా కేంద్రం కొనుగోలు చేసేలా చూడాలని సూచించారు.