
న్యూఢిల్లీ: బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికాయి. పార్లమెంట్ లోపల మాత్రమే కాదు వెలుపల కూడా విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ, విపక్ష ఎంపీలు పాల్గొని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. విపక్షాల ఆందోళన కారణంగా ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఈసీ నిర్ణయంపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా సవరణపై స్టే విధించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాజ్యాంగం ప్రకారం ఈసీకి ఈ ప్రక్రియను నిర్వహించే అధికారం ఉందన్న సుప్రీంకోర్టు.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగించవచ్చని ఈసీకి సూచించింది. ఇదే సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నెలల ముందు 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' నిర్వహించాలనే ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్రమైన సందేహాలను వ్యక్తం చేసింది.
2025 జూన్ 24న కేంద్ర ఎన్నికల సంఘం (ECI) బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో బూత్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఓటర్ల ధృవీకరణ చేస్తున్నారు. ఈ సవరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఎలక్టోరల్ రోల్ సమీక్ష కోసం జరుగుతుందని చెప్పింది ఈసీఐ.2025లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ కీలకమైన అంశంగా మారింది.
ఈ సవరణ ప్రక్రియను విపక్ష పార్టీలు కాంగ్రెస్, RJD, CPI-ML, AIMIM "వోట్‌బందీ" అంటూ విమర్శించాయి. నెల రోజుల వ్యవధిలో 8 కోట్ల ఓటర్లను ధృవీకరించడం అసాధ్యమని ఈ ప్రక్రియ పేదలు, మైనారిటీలు, వలస కార్మికుల ఓటు హక్కును హరించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.