సమ్మె టైమ్‌‌‌‌‌‌‌‌లో నోటి లెక్కలు

సమ్మె టైమ్‌‌‌‌‌‌‌‌లో నోటి లెక్కలు

బిల్లులు, రసీదుల్లేవంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు:  సమ్మె టైమ్‌‌‌‌‌‌‌‌లో ఆర్టీసీలో పెట్టిన ఖర్చులకు లెక్కలు తేలడం లేదు. దేనికి ఎంత పెట్టింది అనే బిల్లులు, రసీదులు ఏవీ లేవని ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌ ఆడిటింగ్‌‌‌‌‌‌‌‌లో వెల్లడవుతోంది. ముఖ్యం సమ్మె మొదటి 15 రోజుల్లో డబ్బులు ఏమైనా వచ్చాయా పోయాయా అనేదానికి ఎలాంటి లెక్కలు లేవు…  డిపోల్లో అధికారులు ఏ వివరాలు చెప్పడం లేదని సమచారం. ఆడిటర్లు ఏం అడిగినా దానికి పెట్టినం.. దీనికి పెట్టినం అని నోటి లెక్కలు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో అధికారులు అవినీతికి పాల్పడ్డారని యూనియన్ నేతలు ఇప్పటికే ఆరోపించారు. మరోవైపు ఉన్నతాధికారులు మాత్రం ఆధారాలతో సహా దొరికితేనే చర్యలు తీసుకుంటామంటున్నారు.

ఆడిటింగ్‌‌‌‌‌‌‌‌ ఇట్ల

52 రోజుల సమ్మె కాలంలో జరిగిన లావాదేవీలపై ఆర్టీసీ ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌గా ఆడిటింగ్ నిర్వహిస్తోంది. కార్మికుల నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు సమ్మెలో పాల్గొన్నారు. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో బస్సులు నడపడమే లక్ష్యంగా ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. ఆడిటింగ్ అధికారులు డిపోల్లో ఎంత ఆదాయం వచ్చింది.. ఎంత ఖర్చైంది.. రోజుకు ఎన్ని బస్సులు తిరిగాయి.. బ్యాంక్‌‌‌‌‌‌‌‌ రిమిట్టెన్స్‌‌‌‌‌‌‌‌, బయటకు వచ్చిన డబ్బులు, రిజిస్టర్లు ఏ మేరకు మెయింటెన్‌‌‌‌‌‌‌‌ చేశారు.. బ్యాంక్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్లు, సెక్యూరిటీ వద్ద ఉన్న రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆపరేషన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఎంత డీజిల్‌‌‌‌‌‌‌‌ ఖర్చు అయింది.. బందోబస్తు ఏర్పాట్లు, విభాగాలు, టెంపరరీ ఉద్యోగులకు చెల్లింపులు అడిగి తెలుసుకుంటున్నారు. కొన్ని చోట్ల తాత్కాలిక సిబ్బంది పేర్లు ఎక్కువగా రాసి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇతర శాఖల నుంచి వచ్చిన, ఆర్డీవోలకు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు అప్పగించారు. వారు కూడా అందినకాడికి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

బిల్లుల్లేవు.. రసీదుల్లేవు..

52 రోజుల సమ్మె కాలంలో ఒక్కో డిపోలో సుమారుగా 4 నుంచి 5కోట్ల లావాదేవీలు జరిగాయి. సమ్మె మొదటి 15 రోజుల్లో అసలు డబ్బులు వచ్చాయా, పోయాయా అనే లెక్కలే లేవు. వాటిని ఆర్టీసీ ఉన్నతాధికారులే లెక్కలోకి తీసుకోపోవడం గమనార్హం. ఆడిట్ అధికారులు లెక్కలు అడిగితే మాత్రం నోటి మాటలతో సరిపెడుతున్నారు. ‘బిల్లులు లేవు.. రసీదులు లేవు. సమ్మె సమయంలో ఎవరూ లేకున్నా మేమే పనిచేశాం. బిల్లులు ఎవరు మెయింటెన్ చేసిన్రు. ఎక్కడ పోయే డబ్బులు అక్కడికి పోయినయి.. మేమేమైనా తిన్నమా..’ అని కొందరు అధికారులు సమాధానమిస్తున్నట్లు తెలిసింది.

ఎప్పుడు పూర్తయ్యేనో..?

ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన ఆడిట్ఇప్పటి వరకు సికింద్రాబాద్ రీజియన్లో 15 డిపోల్లోనే పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 97డిపోలు ఉండగా, మిగతావి ఎప్పుడు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. డిపోకు రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతోంది. పది టీమ్‌‌‌‌‌‌‌‌లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. దీంతో ఆడిట్‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యేసరికి చాలా రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటిదాకా ఎక్కడా అవినీతికి పాల్పడినట్లు తేలలేదని ఆర్టీసీ ఫైనాన్షియల్ అడ్వయిజర్ రమేశ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ఆధారాలతో సహా తేలితేనే చర్యలు తీసుకుంటామన్నారు.

నూటికి నూరుపాళ్లు అవినీతి జరిగింది..

సమ్మె సమయంలో అదును చూసి అధికారులు నూటికి నూరుపాళ్లు అవినీతికి పాల్పడ్డారు. వీరితోపాటు ఇతర విభాగాల నుంచి వచ్చిన వారు కూడా అక్రమాలు చేశారు. మేం మొదటి నుంచి ఇదే చెబుతున్నాం. అందుకే అధికారులు లెక్కలు సరిగా చెప్పడంలేదు. ఆడిటింగ్ త్వరగా, పారదర్శకంగా నిర్వహించాలి. అక్రమాలు  చేసినవారిపై  చర్యలు తీసుకోవాలి.

– అశ్వత్థామ రెడ్డి, కన్వీనర్ ఆర్టీసీ జేఏసీ