ఆరోపణలు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దమే : ఓఎస్డీ హరికృష్ణ

 ఆరోపణలు నిరూపిస్తే ఎలాంటి  శిక్షకైనా సిద్దమే :  ఓఎస్డీ హరికృష్ణ

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపుల  ఘటనపై సస్పెండ్ అయిన ఓఎస్డీ హరికృష్ణ స్పందించారు.  విచారణలోనే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. వేధింపులు నిజం కాదని,  కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని హరికృష్ణ తెలిపారు.  స్పోర్ట్స్ స్కూల్ కు వస్తున్న పేరు చూసి ఓర్వలేక తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.  

సెలక్షన్స్ టైమ్ లోనే తనని టార్గెట్ చేశారని హరికృష్ణ ఆరోపిస్తున్నారు.  విచారణలో భాగంగా విద్యార్థినుల్ని  అడిగితే అసలు నిజాలు తెలుస్తాయన్నారు హరిక‌ృష్ణ.  తనపై ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే ఎలాంటి  శిక్షకైనా సిద్దమన్నారు.  మరోవైపు  ఓఎస్డీ హరికృష్ణకు కొందరు కోచ్ లు కూడా మద్దతుగా  నిలిచారు.  వేధింపుల ఆంశం తమ దృష్టికి  రాలేందంటున్నారు కోచ్ లు.  

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనను  తెలంగాణ సర్కార్  సీరియస్ గా తీసుకుంది.  బాలికలపై వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదురుకుంటున్న అధికారి హరికృష్ణపై  ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.  ఈ ఘటనపై దర్యాప్తునకు ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి జైలుకు పంపిస్తామన్నారు.  మహిళలను వేధిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 

అంతకుముందు స్పోర్ట్స్ స్కూల్ లో అరాచకాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.  సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదన్నారు.  బాలిక పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం చేయాలని మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కోరారు.   కవిత ట్వీట్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్  వెంటనే స్పందించారు.