- కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా వైద్యం
- ఇప్పటిదాకా 2,300 మందికిపైనే ట్రీట్ మెంట్
- డ్రెస్సింగ్, సర్జరీలు, స్పెషల్ చెప్పులు అన్నీ ఫ్రీ
- ఒక్క కాలు కూడా తీసేయలేదంటున్న డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: షుగర్ వచ్చిందంటే చాలు.. అది ఒంట్లో ఏ భాగాన్ని తింటుందోనని బాధితులు భయపడిపోతుంటారు. ముఖ్యంగా కాళ్లకు చిన్న దెబ్బతగిలినా.. అది మానక, ఇన్ఫెక్షన్ అయ్యి చివరికి కాలు తీసేసే (ఆంప్యుటేషన్) పరిస్థితి దాకా వెళ్తుంది. ఇలాంటి నరకయాతన పడుతున్న పేషెంట్లకు ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. షుగర్ బాధితుల కాళ్ల సంరక్షణ కోసం స్పెషల్ గా ‘డయాబెటిక్ ఫుట్ కేర్ సెంటర్’ పెట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. పది రకాల డాక్టర్ల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఒక్కో సమస్యకు ఒక్కో దిక్కు వెళ్లే అవసరం లేకుండా సింగిల్ విండో పద్ధతిలో వైద్యాన్ని అందిస్తున్నారు. 2022లో ప్రారంభమైన ఈ సెంటర్ ద్వారా ఇప్పటివరకూ వేలమంది కాళ్లను కాపాడామని డాక్టర్లు పేర్కొంటున్నారు.
ఒకేచోట అన్ని సేవలు
సాధారణంగా షుగర్ పేషెంట్ కాలికి పుండు పడితే.. జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్, వాస్క్యులర్ డాక్టర్.. ఇలా రకరకాల డిపార్ట్‌మెంట్ల చుట్టూ ఫైల్ పట్టుకొని తిరగాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గుర్తించిన ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ కుమార్ సహాయ్, ఎండోక్రైనాలజీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ నీలవేణి, సర్జరీ డిపార్ట్ మెంట్ హెచ్ఓడీ పల్లం ప్రవీణ్, సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ రమేశ్, వాస్క్యులర్ డిపార్ట్ మెంట్ సహకారంతో ఈ ప్రత్యేక సెంటర్ ను నిర్వహిస్తున్నారు.
ఇక్కడ పేషెంట్ ఒక్కసారి లోపలికి వస్తే చాలు.. సర్జన్ల నుంచి ఫిజీషియన్ల దాకా అందరు స్పెషలిస్టులు ఒకే గదిలో పేషెంట్ ను పరీక్షిస్తారు. దీనివల్ల టైమ్ సేవ్ అవ్వడమే కాకుండా, జబ్బు ముదరకుండానే అన్ని రకాల ట్రీట్‌మెంట్ పొందవచ్చు.
నయా టెక్నాలజీ.. ఫ్రీగా కస్టమైజ్డ్ చెప్పులు
ఇక్కడ చికిత్స అంతా లేటెస్ట్ టెక్నాలజీతో జరుగుతున్నది. పాదాల్లో స్పర్శ పోయిందా? నరాల బలహీనత ఉందా? రక్త ప్రసరణ ఎలా ఉంది? అని తెలుసుకోవడానికి ‘హారిస్ మ్యాట్’ ‘పోడో స్కాన్’ లాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్ మెంట్ తో ఫ్రీగా టెస్టులు చేస్తున్నారు. అంతేకాదు.. పేషెంట్ కాలి సైజును బట్టి, పుండు ఉన్న ప్రదేశాన్ని బట్టి స్పెషల్ గా ఎంసీఆర్ చెప్పులను తయారు చేయించి ఇస్తున్నారు. బయట వేల రూపాయలు ఉండే ఈ చెప్పులను.. హెల్పింగ్ హ్యాండ్స్, లెప్రా ఎన్జీఓల
సహకారంతో... పేద రోగులకు పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 మందికిపైగా ఈ స్పెషల్ చెప్పులను అందజేశామని డాక్టర్లు చెబుతున్నారు.
ఇప్పటి దాకా ఒక్కరి కాలు కూడా తీయలే ఈ క్లినిక్ ప్రారంభమైన 2022 నుంచి ఇప్పటి వరకు సుమారు 2,363 మంది పేషెంట్లకు చికిత్స అందించారు. నెలకు సగటున 200 మందికి పైగా ఇక్కడ సేవలు పొందుతున్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ క్లినిక్ లో ట్రీట్‌మెంట్ తీసుకున్న వారిలో ఇప్పటివరకూ ఏ ఒక్కరి కాలు కూడా తొలగించాల్సిన అవసరం రాలేదని రికార్డులు చెబుతున్నాయి. పుండు ఎంత తీవ్రంగా ఉన్నా, అత్యాధునిక వైద్యంతో నయం చేసి పంపిస్తున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఓపీ బ్లాక్‌లోని రూమ్ నంబర్ 220లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఉదయం వేళల్లో ఓపీ నడుస్తుంది. కాలికి గోరుచుట్టు వచ్చినా, చిన్న బొబ్బ వచ్చినా, స్పర్శ తగ్గినా వెంటనే ఉస్మానియాకు రండి.. నిర్లక్ష్యం చేయకండి అని డాక్టర్లు సూచిస్తున్నారు.
నిర్లక్ష్యం వద్దు.. కాళ్లను కాపాడుకోండి
చాలా మంది పేషెంట్లు షుగర్ కంట్రోల్ లేక, కాళ్లకు స్పర్శ తగ్గిపోయి దెబ్బ తగిలినా గమనిస్తలేరు. పుండు ముదిరి ఎముక ఇన్ఫెక్షన్ దారితీసేదాకా ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు. పరిస్థితి ముదిరిపోయి చివరికి కాలు తీయాల్సిన పరిస్థితి వస్తున్నది. కానీ మా డయాబెటిక్ సెంటర్ కు వస్తే.. షుగర్ కంట్రోల్ చేయడంతో పాటు, పుండు ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ట్రీట్ మెంట్ అందిస్తాం. కాలిపై ఒత్తిడి పడకుండా కస్టమైజ్డ్ చెప్పులు ఇస్తున్నాం. ఇప్పటివరకు ఎవరికీ కాలు తీయాల్సిన అవసరం రాలేదు. షుగర్ పేషెంట్లకు చిన్న గాయమైనా సరే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఉస్మానియాకు రావొచ్చు. అన్ని చికిత్సలు ఉచితంగా అందిస్తున్నాం. – డా. నీలవేణి, హెచ్ఓడీ, ఎండోక్రైనాలజీ, ఉస్మానియా హాస్పిటల్, హైదరాబాద్
