బయో డైవర్సిటీ కేంద్రంగా ఓయూ 

బయో డైవర్సిటీ కేంద్రంగా ఓయూ 

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కును వీసీ ప్రొఫెసర్ రవీందర్ తో కలిసి టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించారు.  అనంతరం వీసీ రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ రెడ్యానాయక్ తో కలిసి ఆక్సీజన్ పార్క్ లో కలియ తిరిగారు.  మొమిన్ చెరువు అభివృద్ధి, ఇతర మౌళిక వసతుల కల్పనపై వీసీ  రవీందర్ ఎంపీ సంతోష్ కు వివరించారు. హరిత హారంలో భాగంగా హెచ్ఎండీఏ సహకారంతో ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఈ  సందర్భంగా ఎంపీ సంతోష్ మాట్లాడుతూ.. ఓయూలో ఏర్పాటు చేసిన ఈ పార్కు వల్ల క్యాంపస్ చుట్టూ పక్కల ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందన్నారు. సమగ్ర నివేదికతో వస్తే పార్కుతో సహా పలు అభివృద్ధి పనులకు సహకారం అందిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని సంతోష్ పిలుపునిచ్చారు.

అనంతరం వీసీ రవీందర్ మాట్లాడుతూ... వృక్ష మిత్ర ఎంపీ సంతోష్ కుమార్ చేతుల మీదుగా పార్క్ ను ప్రారంభించడం  సంతోషంగా ఉందని చెప్పారు. 200 ఔషధ మొక్కలు, చెట్లతో ఆక్సిజన్ పార్కును ఏర్పాటు చేశామని, 1000కి పైగా నెమళ్లు పార్కులో ఉన్నాయని చెప్పారు. జీవజాతుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత దృష్ట్యా  ఉదయం, సాయంత్రం మాత్రమే పాదచారులకు క్యాంపస్ లోకి అనుమతిస్తున్నాని వెల్లడించారు. సీఎం సహకారంతో పచ్చని చెట్లతో ఉస్మానియా ప్రాంగణం ఆహ్లాదకరంగా మారిందని వీసీ స్పష్టం చేశారు.