ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా తెలుగు సాహిత్య మహాసభలు

ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా  తెలుగు సాహిత్య మహాసభలు
  • ఫిబ్రవరి 9, 10 తేదీల్లో నిర్వహణ
  • హాజరుకానున్న సీనియర్ రచయితలు
  • యువతతో సాహిత్య సమ్మేళనాలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఓయూ తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9, 10 తేదీల్లో ఆర్ట్స్ కాలేజీ వేదికగా రెండు రోజుల పాటు తెలుగు సాహిత్య మహాసభలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్, సదస్సు డైరెక్టర్ ప్రొఫెసర్ కాశీం వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్​ను వీసీ కుమార్, ఇతర అధికారులతో కలిసి శనివారం విడుదల చేశారు. చరిత్ర, సైన్స్​కు జాతీయ సదస్సులు ఉన్నట్లే మాతృభాష సాహిత్యానికి కూడా ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మకత తీసుకొచ్చేందుకు గతేడాది మొదటిసారి ఈ కాంగ్రెస్ ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ ఏడాది డిజిటల్ యుగంలో సాహిత్యం, యువత రచనలపై చర్చలతో పాటు సీనియర్ రచయితలతో మాటాముచ్చట, పద్య కవిత్వం, యువత ఆలోచనలు, పురస్కారాలు, అనువాదాలు, జానపద ప్రదర్శనలు, సమ్మేళనాలు రెండు రోజుల పాటు కొనసాగుతాయని వివరించారు. దాదాపు 55 మంది యువ కవులు, రచయితలు, నవలాకారులు, విమర్శకులు, సినిమా రచయితల, దాదాపు 40 మంది యువ కవిగాయకులు, జానపద వృత్తికళా ప్రదర్శకులు పాల్గొంటారన్నారు. సాహిత్య అభిమానులు సదస్సును విజయవంతం చేయాలని కోరారు.