సునీల్ కనుగోలు టీంతో బద్నాం చేయిస్తుండు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

సునీల్ కనుగోలు టీంతో బద్నాం చేయిస్తుండు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కమిటీల్లోని 108 మందిలో 54 మంది తెలుగుదేశం పార్టీ వాళ్లే ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడా..? అని నిలదీశారు. కొత్త కమిటీల్లో బయటి పార్టీ నుంచి వచ్చినవాళ్లే ఎక్కువగా ఉన్నారన్న ఉత్తమ్ విమర్శించారు. సునీల్ కనుగోలు టీంతో పోస్టులు పెట్టించి సోషల్ మీడియాలో తమను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. తన వాళ్లే పదవుల్లో ఉండాలని తానెప్పుడూ భావించలేదన్నారు. పార్టీని రక్షించుకునేందుకే ఒరిజనల్ కాంగ్రెస్ నేతలంతా సమావేశమయ్యామని ఉత్తమ్ చెప్పారు. 

పార్టీని నమ్ముకొని పనిచేసినవారికి కమిటీల్లో అవకాశం రాలే

కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీని కాపాడేందుకు సేవ్ కాంగ్రెస్ కార్యక్రమం చేపడతామన్నారు. పార్టీని నమ్ముకొని పని చేసిన వారికి కమిటీల్లో అవకాశం రాలేదని తెలిపారు. ఈ విషయంలో తాను కూడా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో సీనియర్ నేతలను కించపరిచేలా పోస్టులు పెడుతూ పార్టీని బలహీన పరుస్తున్నారని మండిపడ్డారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని కొందరు నేతలు తనతో చెప్పారని.. అయితే కమిటీల నియామకంలో తాను పాలుపంచుకోలేదని భట్టి చెప్పారు. కాంగ్రెస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తామని.. దేశవ్యాప్తంగా పార్టీని కాపాడుకుంటామన్నారు.