సీఎం ఆదేశాలు అమలు చేస్తలేరు.. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించం : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ

సీఎం ఆదేశాలు అమలు చేస్తలేరు.. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించం : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ
  • 28 శాఖల్లో ఔట్​సోర్సింగ్​ఉద్యోగులకు ఇంకా జీతాలందలేదు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెలా మొదటి తేదీనే జీతాలు చెల్లించాలన్న సీఎం స్పష్టమైన ఆదేశాలను క్షేత్రస్థాయిలో తుంగలో తొక్కుతున్నారని రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని శాఖల హెచ్‌‌ఓడీలు, జిల్లా డీడీఓలు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్లక్ష్యం వల్లే బిల్లులు సమయానికి సమర్పించకుండా వేలాది మంది కార్మికుల పొట్ట కొడుతున్నారని జేఏసీ రాష్ట్ర చైర్మన్ పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి దోయిపడి శ్రీధర్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ అందుబాటులో ఉన్నప్పటికీ జీతాలు విడుదల చేయకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, దీనిపై ప్రశ్నిస్తే ఏజెన్సీలపై నెట్టేస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఆదేశాలను ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనేక విభాగాల్లో వేతనాలు పెండింగ్

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు నెలల తరబడి పెండింగ్‌‌లో ఉండటం వల్ల వారు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జేఏసీ నేతలు వివరించారు. మోడల్ స్కూళ్లలో ఏకంగా 7 నెలలుగా, వరంగల్ ఈఎస్ఐ డిస్పెన్సరీలో 4 నెలలుగా, పంచాయతీరాజ్, గ్రౌండ్ వాటర్ శాఖలలో 3 నెలలుగా జీతాలు అందక కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. వీటితో పాటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాకతీయ మెడికల్ కాలేజ్, ఫారెస్ట్, లైబ్రరీ, మైనింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాల, బీసీ, సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, సగానికి పైగా మున్సిపాలిటీలు తదితర అనేక విభాగాల్లో వేతనాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు.

జమకాని  ఈఎస్ఐ, ఈపీఎఫ్ నిధులు

మరోవైపు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగుల జీతాల నుంచి ఈఎస్ఐ, ఈపీఎఫ్ మొత్తాలను మినహాయిస్తున్నప్పటికీ, వాటిని సంబంధిత ఖాతాల్లో జమ చేయకుండా పెద్ద ఎత్తున నిధుల మోసానికి పాల్పడుతున్నాయని జేఏసీ నేతలు ఆరోపించారు. దీనివల్ల ఉద్యోగులు కనీస వైద్య సేవలతో పాటు భవిష్యత్ సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారని, ఇది ముమ్మాటికీ కార్మిక చట్టాల ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మధ్యవర్తులుగా ఉన్న ఏజెన్సీల వ్యవస్థను పూర్తిగా సమీక్షించి, నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేసే శాశ్వత విధానాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేసి, ఈఎస్ఐ, ఈపీఎఫ్ చెల్లింపులపై సమగ్ర ఆడిట్ నిర్వహించకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.