హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేసి, ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని తెలంగాణ స్టేట్ అవుట్ సోర్సింగ్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జేఏసీ చైర్మన్ పులి లక్ష్మయ్య ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం మార్చి 31 తర్వాత మళ్లీ పాత ఏజెన్సీలనే రెన్యూవల్ చేయాలని చూస్తోందని.. ఒకవేళ అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఏజెన్సీల ప్రమేయం లేకుండా ప్రభుత్వం లేదా కార్పొరేషన్తో నేరుగా వేతనాలు చెల్లించాలని.. అలాగే ‘సమాన పనికి సమాన వేతనం’ నిబంధనను అమలు చేయాలని కోరారు.
మరోవైపు, గత కొంతకాలంగా రెవెన్యూ, హెల్త్, మార్కెటింగ్, ఎక్సైజ్ వంటి వివిధ శాఖల్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులను అకారణంగా తొలగించడంపై జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తొలగించిన వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ సమస్యలపై చర్చించేందుకు తమ నిరసనను తెలియజేసేందుకు శనివారం సమావేశం కానున్నట్టు తెలిపింది.
