మినిమం బ్యాలెన్స్ లేని అకౌంట్లపై జరిమానాలు వేసి.. రూ.8 వేల కోట్లు సంపాదించిన బ్యాంకులు

మినిమం బ్యాలెన్స్ లేని అకౌంట్లపై జరిమానాలు వేసి.. రూ.8 వేల కోట్లు సంపాదించిన బ్యాంకులు

అరేఓ సాంబా.. అడుక్కునే వాడి దగ్గర గీక్కుక్కోవటం ఏంట్రా.. ఈ సినిమా డైలాగ్ ఇప్పుడు ఇండియాలో వెరీ వెరీ ఫేమస్ అయ్యింది.. ఎందుకు అంటారా.. మన గ్రేట్ బ్యాంకులు చేసిన పనికి.. అవును.. బ్యాంక్ అకౌంట్లలో.. కనీస నిల్వ.. అదేనండీ మినిమం బ్యాలెన్స్.. అంటే ఏడాదిలో 5 వేలు.. 10 వేల రూపాయల డబ్బులు కూడా లేకపోవటం.. అలాంటి బ్యాంకు ఖాతాల్లో ఫైన్స్.. జరిమానాలు వేశాయి బ్యాంకులు.. మన దేశ వ్యాప్తంగా బ్యాంకులు.. డబ్బులు లేని బ్యాంక్ ఖాతాలపై జరిమానాలు వేయటం ద్వారా.. ఎంత సంపాదించాయో తెలుసా.. అక్షరాల 8 వేల కోట్ల రూపాయలు.. ఏంటీ 8 వేల కోట్ల రూపాయలా అని అవాక్కయ్యారా.. నోరెళ్లబెట్టారా.. అవును.. ఇది పచ్చి నిజం.. ఈ పూర్తి వివరాలు తెలుసుకుందామా..

బ్యాంక్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఆయా బ్యాంకులు ఖాతాదారులపై జరిమానా విధిస్తాయనే విషయం తెలిసిందే. ఇలా మినిమం బ్యాలెన్స్ లేని అకౌంట్లపై గత మూడేళ్లలో బ్యాంకులు ఎన్ని జరిమానాలు విధించాయని లోక్ సభలో ఓ ఎంపీ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

గత మూడేళ్లలో మినిమం బ్యాలెన్స్ లేని ఖాతాదారుల నుంచి బ్యాంకులు రూ.8,092 కోట్ల ఛార్జీ వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు. 2022-23లో రూ.2,407.82 కోట్లు, 2023-24లో రూ.2,909.1 కోట్లు, 2024-25లో రూ.2,775.91 కోట్లు ఖాతాదారుల నుంచి ఫైన్ల రూపంలో బ్యాంకులు వసూల్ చేశాయని తెలిపారు. ఇవి కేవలం దేశంలోని 11 ప్రభుత్వరంగ బ్యాంక్ వసూల్ చేసిన చార్జీలే. 

హెచ్‎డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ వంటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు వసూల్ చేసిన ఛార్జీలు ఇందుకు అదనం. ఇక, ఖాతాదారులకు బ్యాంక్ కార్యకలాపాలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లు పంపినందుకు రుసుముల కింద రూ.3,387 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. 2022-23లో రూ.1,193.19 కోట్లు, 2023-24లో రూ.976.98 కోట్లు, 2024-25లో  రూ.1,217.6 కోట్ల ఛార్జీలను బ్యాంకులు వసూలు చేసినట్లు వివరించారు.