కార్లు,బైకులు అమ్మాలనుకుంటున్నారా..గతంలో మాదిరిగా ఇష్టం అమ్మడానికి వీలులేదు. అంతేకాదు ఆర్టీవో ఆఫీసులకు వెళ్లాల్సిన పనీలేదు. అంతా ఆన్ లైన్ లోనే. మధ్యవర్తులు ఎవ్వరు ఉండరు. కేవలం ఆధార్ కార్డుతో లింక్ చేసి యాక్టివ్ గా ఉన్న మొబైల్ నంబర్ కు వచ్చే OTP ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. వెహికల్స్ కు సంబంధించిన మోసాలు, నేరాలు అరికట్టేందుకు వెహికల్స్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే..
దేశవ్యాప్తంగా వెహికల్ ఓనర్ షిప్ ట్రాన్ఫర్ కు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై వాహన యజమాని ఆధార్ కు అనుసంధానమైన మొబైల్ నంబర్ కు వచ్చే OTPని ఎంటర్ చేసిన తర్వాతే ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్ అవుతుంది.కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలతో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఈ మార్పులను అమలు చేస్తోంది.
కొత్త రూల్స్ తో వెహికల్ కు సంబంధించిన మోసాలు, నేరాలు, ఆర్టీవో ఆఫీసుల్లో అవినీతికి చెక్ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇకపై ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్ కోసం ఆర్టీవో ఆఫీసుల చుట్టు తిరుగుతూ హార్డ్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదంటున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది.
వాహన యజమానులు తమ ఆధార్‌ను వాహన రికార్డులతో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉన్న పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో ఒకేలా ఉండాలి. అలాగే ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఉండాలి. లేదంటే ముందుగా ఆ వివరాలను సరిచేసుకోవాలి.
2018కు ముందు నమోదు చేసిన కొన్ని వెహికల్స్ కు మాత్రమే తాత్కాలికంగా మొబైల్ OTP సౌకర్యం ఉంటుంది. అయితే ఒకసారి 'వాహన్' పోర్టల్ ద్వారా సేవ పొందిన తర్వాత ఆ వాహనం పూర్తిగా ఆధార్ ఆధారిత వ్యవస్థలోకి మారుతుంది.
దీంతోపాటు వెహికల్ రికార్డుల నుంచి లోన్ తొలగింపు ప్రక్రియను కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. రుణదాత నుంచి బకాయిలు లేవని ధృవీకరణ వచ్చిన వెంటనే రికార్డులు ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి.
