ఎల్కతుర్తి, వెలుగు : వడ్ల కొనుగోళ్లను స్పీడప్ చేసి రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు.
కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బావులను అద్దెకు తీసుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇసుక కొరత లేకుండా చూసి, జూన్ 2 నాటికి గృహప్రవేశాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
రైతులు ఆయిల్‌పామ్ సాగు వైపు మళ్లేలా అవగాహన కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ పనులను పూర్తి చేయాలని, చెక్ డ్యామ్‌లు, ఫీడర్ చానళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి, రాథోడ్ రమేశ్, జడ్పీ సీఈవో శేషాద్రి, డీఆర్‌డీవో మేన శ్రీను, డీపీవో లక్ష్మీ రమాకాంత్, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్‌బాబు, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వాజీద్ అలీ, ఏడీఏ ఆదిరెడ్డి, తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీవో విజయ్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎస్ఎంఆర్ గార్డెన్స్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

