- ఆయిల్ దిగుమతులు 300 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరిగాయని ఆవేదన
ఇస్లామాబాద్: ఇరాన్, ఇజ్రాయెల్–అమెరికా యుద్ధంతో తమ దేశ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతిన్నదని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ప్రస్తుతం తాము సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నామని తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గురువారం కేబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధానికి తమ దేశ ఆయిల్ దిగుమతులు 300 డాలర్లు (రూ.2,800 కోట్లు) ఉంటే ఇప్పుడు అవి 800 మిలియన్ (రూ.7,600 కోట్లు) డాలర్లకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ ఎకానమీపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.
అలాగే గత వారంతో పోలిస్తే, ఈవారం పెట్రోలియం వినియోగం కూడా తగ్గిందని వెల్లడించారు. ‘‘ప్రస్తుతం దేశంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం. ఆ టాస్క్ ఫోర్స్ రోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నది. దేశంలో సవాళ్లను ఎదుర్కోవడానికి అందరూ కలిసి పనిచేయాలి. ఇక ఇరాన్, అమెరికా మధ్య జరిగిన మొదటి రౌండ్ గురించి మా కేబినెట్‌కు తెలియజేశాను. పశ్చిమాసియాలో ప్రాంతీయ సుస్థిరతను ప్రోత్సహించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం.
ఏప్రిల్ 11న ఇరాన్, యూఎస్ మధ్య దాదాపు 21 గంటలపాటు మారథాన్ చర్చలు నడిచాయి. దౌత్యపరంగా పురోగతి కనిపించింది. రెండు దేశాల మధ్య సమన్వయ ప్రయత్నాల కోసం, చర్చలు ఫలవంతం కావడానికి పాకిస్తాన్ సిన్సియర్‌గా ప్రయత్నించింది” అని షెహబాజ్
పేర్కొన్నారు. ఆ చర్చల తర్వాతే ఇరాన్, అమెరికా సీజ్ ఫైర్‌పై ప్రకటనచేశాయని ఆయన చెప్పారు.

