అఫ్గాన్‌‌పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్.. 13 మంది మృతి.. అందులో 11 మంది చిన్నారులు 

అఫ్గాన్‌‌పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్.. 13 మంది మృతి.. అందులో 11 మంది చిన్నారులు 
  • మరో 14 మందికి తీవ్ర గాయాలు 
  • ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్స్​ లక్ష్యంగా అటాక్‌‌లు

కాబూల్‌‌: అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. ఈ విషయాలను వెల్లడిస్తూ అఫ్గాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ అటాక్‌‌లు అఫ్గానిస్తాన్‌‌లోని ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుని జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో మొత్తం13 మంది ప్రాణాలు కోల్పోగా.. వీరిలో 11 మంది పిల్లలు ఉన్నారని వెల్లడించారు. అందరూ గాఢ నిద్రలో ఉండగా దాడులు జరగడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని వివరించారు. 

ఖోస్ట్ ప్రావిన్స్‌‌ స్పెరా జిల్లాలోని ఒక ఇంటిపై బాంబు దాడి జరగడంతో తొమ్మిది మంది మరణించారని,  మరో 14 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న పక్తికా ప్రావిన్స్‌‌లోని బార్మల్ జిల్లాలో జరిగిన మరో దాడిలో ముగ్గురు మరణించారని చెప్పారు. ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని, మరణించిన వారంతా పిల్లలేనని పేర్కొన్నారు. కాగా, పాకిస్తాన్ ఈ దాడులపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. 

అయితే, తమ భూభాగంపై దాడులకు పాల్పడుతున్న టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకునే తాము అఫ్గానిస్తాన్‌‌పై అటాక్‌‌లు చేస్తున్నట్టు పాకిస్తాన్ గతంలో పలుమార్లు పేర్కొంది. 2021లో తాలిబన్లు రెండోసారి అఫ్గానిస్తాన్‌‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. 

పాకిస్తాన్‌‌పై దాడులకు పాల్పడుతున్న టెర్రరిస్టులకు, ముఖ్యంగా ‘తెహ్రీక్- ఎ -తాలిబన్ పాకిస్తాన్’ (టీటీపీ) కు అఫ్గానిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. అయితే, అఫ్గాన్ అధికారులు ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు.