పెట్రోల్ కొరతలో.. వర్క్ ఫ్రం హోం ఇచ్చిన దేశం.. ముందస్తు జాగ్రత్త

పెట్రోల్ కొరతలో.. వర్క్ ఫ్రం హోం ఇచ్చిన దేశం.. ముందస్తు జాగ్రత్త

అమెరికా, ఇరాన్ యుద్ధం భీకరంగా సాగుతుంది. ఈ ప్రభావం వాళ్ల దేశాలపైనే కాదు.. ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే దీని ప్రభావం ఆసియా ఖండానికి తాకింది. పెట్రోల్, డీజిల్ కొరత ఆయా దేశాల్లో సంక్షోభాన్ని తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే ముందస్తు జాగ్రత్తకు దిగాయి కొన్ని దేశాలు. అందులో పాకిస్తాన్ ఫస్ట్ లో ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో నిల్వ ఉన్న పెట్రోల్, డీజిల్.. జస్ట్ 26 రోజులకు మాత్రమే వస్తుంది.. ఆ తర్వాత పరిస్థితి ఏంటీ.. దేశం ఆగిపోతుంది కదా.. అందుకే ముందు జాగ్రత్తగా వర్క్ ఫ్రం హోం ప్రకటించింది పాకిస్తాన్ దేశం. ఇంట్లో ఉండి పనులు చేసుకోండి.. ఆఫీసులకు రావొద్దు.. అనవసరంగా బయట తిరగొద్దు అని ఆదేశాలు జారీ చేసింది పాకిస్తాన్ దేశం.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత పొరుగు దేశం పాకిస్తాన్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. చమురు సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను తట్టుకునేందుకు పాక్ ప్రభుత్వం ఇప్పుడు అత్యవసర చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మళ్లీ 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని అమలుకు ఆదేశాలు జారీ చేసింది.

హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో ఇంధన దిగుమతులు ఖరీదైనవిగా మారాయి. చమురు వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వీలైన చోటల్లా 'వర్క్ ఫ్రమ్ హోమ్' తప్పనిసరి చేయాలని పాక్ ఆర్థిక సమన్వయ కమిటీ ప్రతిపాదించింది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి, పెట్రోల్, డీజిల్ నిల్వలను మరికొన్ని రోజులు కాపాడుకోవచ్చని పాక్ భావిస్తోంది.

యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో భద్రత కరువైంది. గతంలో ఒక్కో షిప్‌కు 30 వేల డాలర్లుగా ఉన్న ఇన్సూరెన్స్ ఖర్చు ఇప్పుడు ఏకంగా 4 లక్షల డాలర్లకు పెరిగింది. అలాగే ఫ్రైట్ ఛార్జీలు 9 లక్షల డాలర్ల నుంచి 40 లక్షల డాలర్లకు చేరాయి. ఈ అదనపు భారాన్ని చమురు కంపెనీలు భరించలేకపోతుండటంతో పాక్ ప్రభుత్వం వారానికోసారి పెట్రోల్ ధరలను సవరించాలని నిర్ణయించింది. చమురు సంక్షోభం వల్ల డీజిల్‌పై రూ.50, పెట్రోల్‌పై రూ.26 అదనపు భారం పడింది. పరిస్థితి చేయి దాటకముందే, సమస్యను మొగ్గలోనే తుంచివేయాలని పాక్ భావిస్తోంది.

ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 25 నుంచి 26 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అయితే కువైట్ నుంచి వచ్చే డీజిల్ సరఫరా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో హార్ముజ్ జలసంధితో సంబంధం లేని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతి చేసుకునేందుకు పాక్ స్టేట్ ఆయిల్ టెండర్లు పిలిచింది. ఎర్ర సముద్రం ద్వారా క్రూడ్ ఆయిల్ సరఫరా చేయాలని సౌదీ అరేబియాను కూడా కోరింది పాకిస్తాన్. ప్రజలు ఆందోళనతో పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని, ఇది కేవలం సరఫరా నిర్వహణలో భాగమేనని అధికారులు కోరుతున్నారు.