- వరల్డ్ కప్‌లో పాక్ పాల్గొంటుందని వెల్లడి
లాహోర్: టీ20 వరల్డ్ కప్‌కే హైలైట్‌గా నిలిచే ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్‌ను చూడాలని ఆశిస్తున్న ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఈ టోర్నీలో టీమిండియాతో జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు పాకిస్తాన్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇండియాలో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌పై ఐసీసీ బహిష్కరణ వేటు వేయడానికి నిరసగా పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నెల 7న మొదలయ్యే మెగా టోర్నీలో పాల్గొంటామని తెలిపింది. ఈ మేరకు తమ జట్టుకు అనుమతి ఇస్తున్నట్టు పాక్ గవర్నమెంట్ తెలిపింది. ఈ నెల 15న కొలంబోలో ఇండియాతో జరిగే మ్యాచ్‌లో తమ జట్టు బరిలోకి దిగబోదని తెలిపింది. దాంతో 2010 తర్వాత ఇండో–--పాక్ పోరు లేని తొలి ఐసీసీ ఈవెంట్‌గా ఈ మెగా టోర్నీ నిలవనుంది.పాక్ గ్రూప్–ఎలో ఇండియా, నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్‌ఏతో కలిసి బరిలోకి దిగుతోంది. పాక్ మ్యాచ్‌ను బహిష్కరిస్తే ఆ రెండు పాయింట్లు ఇండియాకు దక్కుతాయి.. అయితే గ్రూప్‌లోని మిగిలిన నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏ మూడు చిన్న జట్లే కావడంతో వాటిపై గెలిస్తే ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసినా పాక్ సూపర్–8 రౌండ్ చేరుకోనుంది. కాగా, ఐసీసీ నిర్వహించే ఏ టోర్నీలోనైనా దాయాది జట్ల మ్యాచ్ అనేది ప్రధాన ఆదాయ వనరు. ఈ మ్యాచ్ రద్దయితే ఐసీసీకి, బ్రాడ్‌కాస్టర్లకు వందల కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
నేడు ఐసీసీ బోర్డు భేటీ.. పాక్‌ను తప్పించే చాన్స్!
ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన పాక్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు ఐసీసీ రెడీ అవుతోంది. సోమవారం వర్చువల్‌గా సమావేశం కానున్న ఐసీసీ బోర్డు మెంబర్స్ నిబంధనల ఉల్లంఘన కింద పాక్‌ను ఈ టోర్నీ నుంచే పూర్తిగా బహిష్కరించే అవకాశం ఉంది. అప్పుడు ఉగాండా టోర్నీలోకి వస్తుంది. ఇండో–పాక్ మ్యాచ్ రద్దు వల్ల బ్రాడ్‌కాస్టర్ కు కలిగే రూ. 200 కోట్లకు పైగా నష్టాన్ని పీసీబీనే చెల్లించాలని ఆదేశించడం, పీసీబీకి అందాల్సిన వార్షిక ఆదాయ వాటాను నిలిపివేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవచ్చు.
