హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. డిసెంబర్ 11న ఫస్ట్ ఫేజ్, డిసెంబర్ 14న సెకండ్ ఫేజ్, డిసెంబర్ 17న థర్డ్ ఫేజ్ పోలింగ్ జరిగింది. అక్కడకక్కడ చెల్లాచెదురు ఘటనలు మినహా మూడు దశల పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలక్షన్ కమిషన్, పోలీసులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం (డిసెంబర్ 17) ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ సమయం ముగిసినా చాలా చోట్ల ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి మధ్యాహ్నం 1 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల సంఘం అధికారులు.
కొన్ని చోట్ల చెల్లాచెదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మూడో విడతలో 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది క్యాండిడేట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లంచ్‌బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. గెలిచిన అభ్యర్థుల పేర్లను వెంటనే ప్రకటిస్తారు.
