ఉద్యోగుల విభజనపై పంచాయతీ సెక్రటరీల అభ్యంతరం

ఉద్యోగుల విభజనపై పంచాయతీ సెక్రటరీల అభ్యంతరం
  • పంచాయతీలను డివైడ్ చెయ్యలే..
  • క్యాడర్ స్ట్రెంత్ ఖరారు చెయ్యలే
  • ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ను తొలగించాలని డిమాండ్


హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలను గ్రేడ్లుగా డివైడ్ చెయ్యకుండా, క్యాడర్ స్ట్రెంత్ ఖరారు చెయ్యకుండా ఉద్యోగుల విభజన ఎలా చేపడతారని పంచాయతీ సెక్రటరీలు ప్రశ్నిస్తున్నారు. ముందుగా ఆ రెండింటినీ ఖరారు చెయ్యాలని, ఆ తర్వాతే విభజన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఉద్యోగుల విభజన సాధ్యం కాదని సీనియర్లు అంటున్నారు. వీటిపై క్లారిటీ ఇవ్వకుండా విభజన చేపడితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. కొన్ని రోజులుగా పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ అధికారులు ఉద్యోగుల విభజనపై కసరత్తు చేస్తున్నా, వీటిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదంటున్నారు. ఉమ్మడి ఏపీలో 8 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిని అప్పట్లో జనాభా, ఆదాయం, విస్తీర్ణం ఆధారంగా గ్రేడ్లుగా విభజించారు.  రాష్ట్రం వచ్చినంక 2018లో టీఆర్ఎస్ సర్కార్ 4,500 కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసింది. 500 జనాభా దాటిన తండాలతో పాటు కొన్ని పెద్ద పంచాయతీలను విడదీసి కొత్త పంచాయతీలు చేసింది.  దాదాపు 200 గ్రామాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపింది.  ఆ తర్వాత పంచాయతీలను గ్రేడ్లుగా విభజించలేదు. 2018లో తెచ్చిన చట్టంలో పంచాయతీ గ్రేడింగ్ తీసేశామని, అన్నింటినీ ఒకే విధంగా పరిగణిస్తామని అధికారులు అంటున్నారు. 


జూనియర్లు రెగ్యులర్ కాలే... 
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 12,761 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 3 వేల మంది సీనియర్లు, 6,600 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు(జేపీఎస్), ఔట్ సోర్సింగ్  పంచాయతీ కార్యదర్శులు (ఓపీఎస్) 3 వేల మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం కార్యదర్శుల్లో 1,2,3,4 గ్రేడ్లు ఉన్నాయి. అయితే ఈ నాలుగు గ్రేడ్లలోనూ సీనియర్లే ఉన్నారు. ప్రొబేషన్ లో ఉన్న జేపీఎస్ లను రెగ్యులర్ చేసినంకనే గ్రేడ్ 4 కేటగిరీలోకి మార్చాలని సర్కార్ భావిస్తోంది. వచ్చే ఏడాది  ఏప్రిల్ లో వీరిని రెగ్యులర్ చేసే అవకాశముంది. కాబట్టి ముందుగా క్యాడర్ స్ర్టెంత్ ఖరారు చెయ్యాలని సీనియర్లు కోరుతున్నారు. ఔట్ సోర్సింగ్ వాళ్లను తొలగించి, ఆ పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పెద్ద పంచాయతీలు, ఆదాయం ఎక్కువ ఉండేవి, ప్రాధాన్యం ఉండే చోట్ల ఎక్కువ జేపీఎస్ లు, ఓపీఎస్ లే పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాల్లో నేతల సిఫార్సులతో ఇష్టానుసారంగా పోస్టింగ్ లు ఇస్తున్నారని అంటున్నారు. 

మూడేండ్లు ఏం చేసిన్రు? 
కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసి మూడేండ్లయినా గ్రేడ్లుగా విభజించలేదు. జేపీఎస్​లను నియమించి రెండేండ్లు దాటినా క్యాడర్ స్ట్రెంత్ ఖరారు చెయ్యలేదు. వీటిపై అధికారులను కలిసినా పట్టించుకోలేదు. ఇప్పుడు పాత క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం రెగ్యులర్ సెక్రటరీలను కేటాయిస్తుండ డంతో వేరే జోన్లకు, జిల్లాకు వెళ్లాల్సి వస్తోంది- మహేశ్, సీనియర్ పంచాయతీ సెక్రటరీ, జహీరాబాద్


జీపీలను డివైడ్ చెయ్యాలే.. 
జనాభా లెక్క ప్రకారం పంచాయతీలను విభజించాలి. పంచాయతీలకు గ్రేడ్లు లేనప్పుడు, కార్యదర్శులను గ్రేడ్ల వారీగా ఎందుకు లెక్కగడుతున్నారు. ఏండ్లుగా ఒకేచోట చేస్తున్నోళ్లను బదిలీ చేసి, సీనియార్టీ లిస్టు తయారు చేయాలి. గ్రేడ్ 3 జిల్లా స్థాయి పోస్టు అయితే జోనల్ పోస్టుగా చూపిస్తున్నారు. మా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి- మధుసూదన్ రెడ్డి, ప్రెసిడెంట్, పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్