ఎమ్మెల్యేలూ.. బయటకు వచ్చి మా గోడు వినండి

ఎమ్మెల్యేలూ.. బయటకు వచ్చి మా గోడు వినండి

 

  • మీ ఆరోగ్యాల కోసం మా జీవితాలు పణంగా పెడ్తున్నం
  •     మా నౌకర్లు రెగ్యులర్​ చేసి     కనీస వేతనాలు అడుగుతున్నం
  •     సమ్మెలోకి వెళ్లి రెండువారాలవుతున్న స్పందించరా?
  •     నిలదీసిన పంచాయతీ కార్మికులు
  •     రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల ముట్టడి 

వెలుగు, నెట్​వర్క్: ఎమ్మెల్యేలు బయటకు వచ్చి తమ గోడు వినాలని పంచాయతీ కార్మికులు నినదించారు.  పంచాయతీ కార్మికుల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 6 వ తేదీనుంచి సమ్మెలోకి వెళ్లిన మల్టీపర్పస్​ ఉద్యోగులు గడిచిన 12 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంప్​ ఆఫీసులను ముట్టడించారు.  ఈ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అందరి ఆరోగ్యాల కోసం తమ జీవితాలు పణంగా పెట్టి పల్లెల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమను సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్​ చేసి, కనీస వేతనాలు ఇచ్చేలా ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయాలని డిమాండ్​ చేశారు.  

సిద్దిపేటలో పోలీసులతో వాగ్వాదం 

సిద్దిపేట రూరల్​ : సీఐటీయూ ఆధ్వర్యంలో సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు క్యాంపు ఆఫీస్​ను కార్మికులు ముట్టడించారు. పోలీసులు కార్మికులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు వారిని శాంతింపజేసి కొంతమందిని క్యాంప్ ​ఆఫీసులోకి అనుమతించారు. వారు మంత్రి పీఏకు వినతి పత్రం ఇచ్చి వెనుదిరిగారు. సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు రవికుమార్ , గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తునికి మహేశ్​ , సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని అర్బన్, రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలతో పాటు జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, ధూల్​మిట్ట, మద్దూరు మండలాలకు చెందిన గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

నవీపేటలో తెల్లవారుజామునుంచే అరెస్టులు 

నవీపేట : నిజామాబాద్​ జిల్లా నవీపేట్ లో సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను పోలీసులు తెల్లవారుజాము నుంచే అరెస్ట్ చేశారు. మండలంలో 120 మంది కారోబార్లు, పారిశుద్ధ్య కార్మికులుండగా 52 మందిని వారి ఇండ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 20 మంది వరకు మహిళా కార్మికులు ఉన్నారు. అయితే, పోలీసులు తమను నేరస్తుల్లా అరెస్ట్ ​చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా తెల్లవారకముందే అరెస్ట్​ చేశారని ఫైర్​ అయ్యారు. బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి పీఎస్​కు వెళ్లి కార్మికులకు మద్దతు పలికారు. ఏసీపీ కిరణ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడి అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నవీపేట్ లో జీపీ కార్మికులను అరెస్ట్  చేశారన్నారు. నాల్లేశ్వర్ సర్పంచ్ సరీన్, ఆనంద్, రామకృష్ణ, రాజేందరగౌడ్, రమణారావు పాల్గొన్నారు.  మరోవైపు జీపీ సెక్రటరీలు, పోలీసుల సహకారంతో జిల్లా సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు, నవీపేట్ సర్పంచ్ అసోళ్ల శ్రీనివాస్  ప్రైవేట్ సిబ్బందితో కలిసి ట్రాక్టర్​నడుపుకుంటూ వచ్చి మేకల, కూరగాయల మార్కెట్​లో చెత్తను ఎత్తించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నార్త్ రూరల్ సీఐ సతీశ్, ఎస్ఐ రాజిరెడ్డి బందోబస్తు నిర్వహించారు.  

సూర్యాపేటలో కార్మికుల అరెస్ట్​ 

సూర్యాపేట : సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడం కోసం కొత్త బస్టాండ్ నుంచి ర్యాలీ మొదలుపెట్టగా పోలీసులు అడ్డుకున్నారు. అయినా కొత్త బస్టాండ్ నుంచి జ్యోతిరావు పూలే విగ్రహం వరకు ర్యాలీ తీశారు. కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కేవీపీఎస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపితో పాటు గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్,  సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనియాకుల శ్రీనివాస్, జేఏసీ జిల్లా నాయకుడు తన్నీరు వెంకన్న లతోపాటు 100 మంది కార్మికులను అరెస్ట్ చేసి సూర్యాపేట రూరల్ పీఎస్​కు తరలించారు. అరెస్టయిన వారిలో వివిధ మండలాల నుంచి వచ్చిన గ్రామపంచాయతీ కార్మికులున్నారు. కార్మికులు కోట రాంబాబు, కోడి ఉప్పలయ్య, కృష్ణ, రాంబాబు, మంగ్య, శంకర్, నాగరాజు, నాగయ్య, ఎల్లమ్మ, నాగమ్మ, సరస్వతి, పిచ్చమ్మ, పూలమ్మ పాల్గొన్నారు.

తెల్లారి నాలుగ్గంటలకే ఇంటికి వచ్చిన్రు

 మేము ఆడోళ్లమని కూడా సూడకుండా పోలీసులు నాలుగ్గంటలకే వచ్చి డోర్లు కొట్టిన్రు. పిల్లలు భయపడ్డరు. మేమేమైనా దొంగలమా? దోపిడీదార్లమా? ఆడవాళ్లను రాత్రి టైంలో, తెల్లారకముందు అరెస్ట్​చేయొద్దని తెల్వదా? ఇంత దారుణం ఎక్కడా సూడలే...
- దేవకి, పారిశుద్ధ్య కార్మికురాలు, నవీపేట్ 

ఆరు గంటల తర్వాతే అరెస్ట్​ చేసినం

తెల్లవారుజామున ముఖ్యమైన వ్యక్తుల ఇండ్ల దగ్గరకు వెళ్లి చూశాం. ఉదయం ఆరు గంటల తర్వాతే మహిళలను అరెస్ట్​ చేసినం. కలెక్టర్, పై అధికారుల ఆదేశాల మేరకు నవీపేట్ ​మాత్రమే కాకుండా ఇతర మండలాల్లో కూడా అరెస్టులు చేశాం. ప్రైవేట్​వ్యక్తులను నియమించుకుని పనులు చేయిస్తుంటే అడ్డుకోవడంతోనే అరెస్టు చేశాం   
- సతీశ్​, నార్త్ రూరల్ సీఐ,