
- పాపికొండల యాత్ర.. బోటుకు వంద టిక్కెట్లు
- భద్రాచలం కేంద్రంగా రెండు పాయింట్లలోనే అమ్మకాలు
భద్రాచలం, వెలుగు: పాపికొండల యాత్ర బోట్ల టిక్కెట్లపై ఈసారి ఆంక్షలు విధించారు. బోటుకు వంద మందిని మాత్రమే అనుమతించనున్నారు. ఆదివారం ఆంధ్రాలోని ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి రెండు బోట్లను అక్కడి టూరిజం డిపార్ట్మెంట్ ప్రారంభించింది. సేఫ్టీనే టార్గెట్‍గా పెట్టుకుని బోట్లలో లైఫ్ జాకెట్లను ఏర్పాటు చేశారు. కంట్రోల్రూంల పర్యవేక్షణలో ఈ బోట్లు ప్రయాణిస్తాయి. తెలంగాణలోని భద్రాచలం కేంద్రంగా ఈస్ట్ గోదావరి జిల్లా వీఆర్‍పురం మండలం పోచవరం నుంచి పాపికొండల యాత్రను ఈ నెల 14 నుంచి షురూ చేయనున్నారు. ఈ మేరకు 8 బోట్లను ముస్తాబు చేశారు. ఈ నెలాఖరు కల్లా మొత్తం 13 బోట్లను తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో భద్రాచలంలో ఇబ్బడిముబ్బడిగా టిక్కెట్ల బుకింగ్ జరిగేది. ప్రైవేటు లాడ్జీలు, టూరిజం హోటల్, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం సత్రాల వద్ద, ఆలయం చుట్టూ ప్రత్యేక కౌంటర్ల ద్వారా టిక్కెట్లను విక్రయించేవారు. వీటిని అమ్మేందుకు కొందరు వ్యక్తులకు కమీషన్లు ఇచ్చి నియమించుకున్నారు. దీంతో రోజూ వేలాది మంది టూరిస్టులు భద్రాచలం నుంచి పాపికొండల యాత్రకు వెళ్లేవారు. కానీ ఈసారి ఈ ప్రక్రియకు చెక్ పెట్టారు. ఈసారి కేవలం ఒక్కో బోటులో వంద లోపు ప్రయాణికులకే అనుమతి ఇవ్వడం, లాంచీలకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో టిక్కెట్లు తక్కువ సంఖ్యలో అమ్మనున్నారు. అవి కూడా కేవలం రెండు పాయింట్లలో మాత్రమే దొరుకుతాయి. ఒక్కో టిక్కెట్ ధర రూ.1,150గా నిర్ణయించారు.