V6 News

రియాన్‌‌ పరాగ్‌‌కు జరిమానా.. కఠిన చర్యలకు సిద్ధమవుతున్న బీసీసీఐ

రియాన్‌‌ పరాగ్‌‌కు జరిమానా.. కఠిన చర్యలకు సిద్ధమవుతున్న బీసీసీఐ

న్యూఢిల్లీ: డ్రెస్సింగ్ రూమ్‌‌లో ఈ–సిగరెట్ తాగిన (వేపింగ్‌‌) రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌‌పై ఐపీఎల్‌‌ ఆర్గనైజర్లు చర్యలు తీసుకున్నారు. పంజాబ్ కింగ్స్‌‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌‌లో ఈ–-సిగరెట్ తాగిన పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 (ఆట ప్రతిష్టకు భంగం కలిగించడం) కింద పరాగ్‌‌ను దోషిగా నిర్ధారించాడు. పరాగ్ తన తప్పును అంగీకరించడంతో జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. మరోవైపు ఈ ఘటనను బీసీసీఐ కూడా సీరియస్‌‌గా తీసుకుంది.

లీగ్ ప్రతిష్టకు భంగం కలిగించే  ఇలాంటి ఘటనలకు కారణమయ్యే ఫ్రాంచైజీ, అధికారులు, ఆటగాళ్లపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. రాయల్స్ ఫ్రాంచైజీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సీజన్‌‌లో రాజస్తాన్ టీమ్  మేనేజర్ డగౌట్‌‌లో ఫోన్‌‌ వాడిన కారణంగా జరిమానా ఎదుర్కోగా, ఇప్పుడు కెప్టెన్ పరాగ్ చర్యతో ఆ ఫ్రాంచైజీ మరింత వివాదంలో చిక్కుకున్నట్లయింది.