- 130 మంది లోక్ సభ సభ్యులు,
- 63 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు
న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ను అభిశంసించాలని కోరుతూ ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం పార్లమెంటులో నోటీసు సమర్పించారు. లోక్ సభలో స్పీకర్, రాజ్యసభలో వైస్ చైర్మన్ కు నోటీసు అందజేశారు. సీఈసీ అభిశంసనకు రెండు సభల్లోనూ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష ఎంపీలు కోరారు.
లోక్ సభ నుంచి 130, రాజ్యసభ నుంచి 63 మంది సభ్యులు ఈ నోటీసుపై సంతకాలు చేశారు. ఇండియా బ్లాక్ లోని అన్ని పార్టీల ఎంపీలు ఈ నోటీసుపై సంతకం చేశారు. కూటమిలో భాగంకాని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కొంతమంది ఇండిపెండెంట్ ఎంపీలు కూడా సంతకం చేసినవారిలో ఉన్నారు. అలాగే సీఈసీపై అభిశంసనకు టీఎంసీ కూడా మద్దతు తెలిపింది.
ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియెట్ కు టీఎంసీ నోటీసు పంపింది. కాగా.. సీఈసీని అభిశంసించాలని కోరుతూ ప్రతిపక్షాలు నోటీసును సమర్పించడం ఇదే తొలిసారి. జ్ఞానేశ్ కుమార్ పై ప్రతిపక్ష ఎంపీలు మొత్తం ఏడు ఆరోపణలు చేశారు. విధి నిర్వహణలో ప్రతిపక్షాలపై ఆయన వివక్ష చూపుతున్నారని, ఎలక్టోరల్ ఫండ్లపై విచారణ జరపకుండా కావాలనే అడ్డుకుంటున్నారని, గంపగుత్తగా ఓటర్లను తొలగించారని తదితర ఆరోపణలు చేశారు.
