రేవంత్ వైఖరి వల్ల రాష్ట్రంలో పార్టీ ఉనికిని కోల్పోతున్నది : మర్రి శశిధర్ రెడ్డి

రేవంత్ వైఖరి వల్ల  రాష్ట్రంలో పార్టీ ఉనికిని కోల్పోతున్నది : మర్రి శశిధర్ రెడ్డి

అది నయమయ్యే పరిస్థితిలో లేదు: మర్రి శశిధర్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేయలేని  స్థితికి చేరుకుందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం  ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ కు లేదని అన్నారు. రేవంత్ రెడ్డికి  పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని తాను అధిష్టానానికి సూచించానని, తెలంగాణ పార్టీ పరిస్థితులపై మూడేళ్ల క్రితమే  అధిష్టానానికి చెప్పానని, అయినా  అధిష్టానం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ‘‘రేవంత్  వ్యవహార శైలి సరిగ్గా లేదు. ఆయన తీరు వల్లే ఈరోజు చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. రేవంత్ వైఖరి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన అందుబాటులో ఉండడు. తన వర్గం వారితో, చెంచాగాళ్లతో పార్టీని నడిపిస్తున్నాడు.

డబ్బు ఖర్చు పెట్టకపోతే టికెట్లు, పదవులు ఇవ్వనని బెదిరిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో 15  మందిని గెలిపించుకొని తన సొంత దుకాణం నడిపించుకోవాలని భావిస్తున్నాడు. రేవంత్ తనకంటూ ప్రత్యేక కోటరీని ఏర్పాటు చేసుకుని పార్టీని నడిపిస్తున్నాడు. పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు”  అని మర్రి పేర్కొన్నారు. ఇన్ చార్జులతో డబ్బు ఖర్చు పెట్టించి వారిని డొల్ల చేశాడని ఆయన విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో రేవంత్  రూ.10 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఒక రూపాయి కూడా పెట్టలేదని ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీని వీడతానని తాను కలలో కూడా అనుకోలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వస్తోందన్నారు. ఒక హోంగార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే నష్టం లేదని తెలిపారు. రెండు మూడు రోజుల్లో పార్టీకి రాజీనామా చేస్తానని, తన లాగే చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉందని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.