మున్సిపోల్స్‌లో ‘ఆంధ్రా లీడర్’ ప్రచారంపై కాంగ్రెస్ ఫైర్
వస్తే ‘సెంటిమెంట్’ దెబ్బతింటుందని బీజేపీ ఆందోళన
జ్వరం కారణంగానే రావట్లేదని చెప్తున్న జనసేన లీడర్లు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన అకస్మాత్తుగా రద్దయ్యింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం శని, ఆదివారాల్లో(ఈ నెల 7, 8న) ఆయన తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ అధిష్టానం రెండు రోజుల క్రితమే హడావుడి చేసింది. కానీ, తీరా చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయ్యింది. దీనికి జనసేన వర్గాలు ‘జ్వరం’ కారణం అని చెప్తున్నా.. అసలు కథ వేరే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ‘ఆంధ్రా లీడర్’తో ప్రచారం చేయిస్తే నష్టమే ఎక్కువ జరుగుతుందన్న చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతోంది. ఇటీవల పవన్‌ను తన నివాసంలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి ఆహ్వానించారు.
పవన్ రెండు రోజులు ప్రచారం చేస్తారని జనసేన కూడా ప్రకటించింది. కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు పలు చోట్ల సభలు పెట్టించాలని బీజేపీ నేతలు భావించారు. అయితే, పవన్ పర్యటన ప్రకటన రాగానే.. మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా లీడర్ల పెత్తనం ఏంది? అంటూ విమర్శలు చేశారు. బీజేపీలోనూ పవన్ పర్యటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఇక్కడి లీడర్లు ఉండగా, ఏపీ డిప్యూటీ సీఎంను తీసుకొచ్చి తిప్పితే.. ప్రత్యర్థులకు ‘జై తెలంగాణ’ అస్త్రం ఇచ్చినట్టే అవుతుందని చెప్పినట్టు సమాచారం. దీంతో వ్యూహాత్మకంగానే పవన్ ను పక్కన పెట్టినట్టు భావిస్తున్నారు. దీనిపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు మాట్లాడుతూ.. పవన్ ప్రచారంపై ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదని చెప్పడం విశేషం.
