పాపం మినిస్టర్ మేడం.. ఫ్రీ బస్ స్కీమ్ లాంఛ్‎ సందర్భంగా మంత్రి మీదపడ్డ వేడి వేడి పాయసం

పాపం మినిస్టర్ మేడం.. ఫ్రీ బస్ స్కీమ్ లాంఛ్‎ సందర్భంగా మంత్రి మీదపడ్డ వేడి వేడి పాయసం

తిరువనంతపురం: కేరళలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్‌జెండర్ల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం 'ప్రియదర్శిని' స్కీమ్‎ను సోమవారం (జూన్ 16) లాంఛనంగా ప్రారంభించింది. ఈ స్కీమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన కేరళ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి బిందు కృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. రద్దీగా ఉన్న బస్సులో ఆమెపై వేడి వేడి  పాయసం (ఖీర్) పడింది. 

ఒక్కసారిగా వేడి వేడి పాయసం మీద పడటంతో మంత్రి బిందు తీవ్ర అసహనానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన మంత్రి రక్షణ సిబ్బంది, కార్యకర్తలు ఆమెకు సహయపడ్డారు. అనంతరం మంత్రి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు.

కేరళలో ఉచిత బస్సు ప్రయాణ పథకం:

అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్ జెండర్లకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని యూడీఎఫ్ కూటమి హామీ ఇచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన యూడీఎఫ్ కూటమి ఇచ్చిన మాట ప్రకారం.. 2026, జూన్ 16 నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.

 ముఖ్యమంత్రి వీడీ సతీసన్ ఈ స్కీమ్‎ను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద మహిళలు, యువత ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి బలమైన, మరింత సమ్మిళితమైన కేరళను నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.