- పెట్రోల్ ధరల పెంపు, పేపర్ లీక్‌పై కాంగ్రెస్ ర్యాలీ.. పాల్గొన్న పొన్నం
హైదరాబాద్, వెలుగు: నీట్ పేపర్ లీక్‌తో లక్షలాది విద్యార్థుల జీవితాలు ఆగమయ్యాయని, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రధాని చేతగాని తనం వల్లే నీట్ విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఫైరయ్యారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నదన్నారు.
నీట్ పేపర్ లీకేజీ, ఎల్పీజీ, పెట్రో ధరల పెంపు, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో వైఫల్యం, రూపాయి పతనం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ చేపట్టింది.
ఈ ర్యాలీలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ మోతె రోహిత్, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
