గూండాయిజం చేస్తామంటే కుదరదు.. బీఆర్ఎస్ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

గూండాయిజం చేస్తామంటే కుదరదు.. బీఆర్ఎస్  నేతలకు పీసీసీ చీఫ్  మహేశ్  గౌడ్  స్ట్రాంగ్  వార్నింగ్
  • మంత్రి వివేక్ కాన్వాయ్‌‌పై దాడి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే 
  • ప్రజా పాలనను జనం ఆదరిస్తున్నరు
  • 94 మున్సిపాలిటీలు గెలవడమే ఇందుకు నిదర్శనం
  • డీసీసీ అధ్యక్షుల శిక్షణకు ఖర్గే, రాహుల్ హాజరవుతారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు గూండాయిజం చేస్తామంటే కుదరదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్​వార్నింగ్ ఇచ్చారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పై దాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన ఫైర్​అయ్యారు.  బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేశారు. ప్రజా పాలనను జనం ఆదరిస్తున్నారని.. 94 మున్సిపాలిటీలు గెలవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. క్యాతనపల్లి ప్రజలు తనతో లేరని తెలిసి అక్కడి మాజీ ఎమ్మెల్యే నానా హంగమా చేశాడని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఎవరైనా లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అలాంటి వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. 

మున్సిపల్ ఎన్నికల్లో 87. 5 శాతం టికెట్లు బలహీనవర్గాలకే..  

మున్సిపల్ ఎన్నికల్లో 87. 5 శాతం టికెట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చామని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. 67 శాతం బీసీలు కౌన్సిలర్లుగా గెలిచారన్నారు. కేసీఆర్ ఓ శిఖరం అని కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని మహేశ్​గౌడ్ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో అదే శిఖరాన్ని జనం ఛీ కొట్టారన్నారు. ఈ నెల 21 నుంచి వికరాబాద్ జిల్లా అనంతగిరిలో డీసీసీ అధ్యక్షులకు పది రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని మహేశ్​గౌడ్​చెప్పారు. దీనికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరుకానున్నారని పేర్కొన్నారు. 

గురువారం ఢిల్లీలో జరగనున్న తెలంగాణ కాంగ్రెస్ మీటింగ్ అన్ని రాష్ట్రాల సమీక్షలో భాగమే అని, ఇప్పటి వరకు 11 రాష్ట్రాల సమీక్షలు జరిగాయని, ఇది 12 వ సమీక్ష అని చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేస్తున్న కామెంట్లను పీసీసీ పరిశీలిస్తోందన్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎవరికి ఎవరు బుల్లెట్ దించారనేది ఢిల్లీ మీటింగ్ తర్వాత చూస్తారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు  బీజేపీ, బీఆర్‌‌ఎస్  ప్రత్యామ్నాయం కాదని తేలిపోయిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం సమిష్టి కృషి అని, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కేబినెట్, పార్టీ క్యాడర్ కే ఈ విజయం దక్కుతుందన్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ 80  శాతం సీట్లు గెలుస్తుందని మహేశ్​గౌడ్​ ఆశాభావం వ్యక్తంచేశారు.