నిజామాబాద్, వెలుగు: ప్రధానిగా మన్మోహన్సింగ్ కేంద్రంలో లీటర్ పెట్రోల్ రూ.60కి లభించిందని, క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా.. మోడీ సర్కార్ లీటర్ రూ.120 వసూల్ చేస్తోందని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన నిజామాబాద్ నగరంలో మున్సిపల్ ఎన్నికల ముగింపు ప్రచార సభలో మాట్లాడారు. ధనవంతులనే బీజేపీ పార్టీ నెత్తినవేసుకుంటుందని, ఏడాదికి 2 కోట్ల జాబ్లిస్తామని మాటిచ్చిమోదీ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే నిర్ణయాలు తీసుకున్నాడని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి సన్నబియ్యం స్కీమ్ తెచ్చిందని చెప్పారు. ఉచిత బస్సుల కొరత తీర్చడానికి మరో 4 వేల బస్సులు కొనబోతున్నామని తెలిపారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని, సీనియర్ లీడర్లంటే ఆయనకు లెక్కలేదని అన్నారు. అతను వాడే భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, నిజామాబాద్ అంటే తన జాగీరు అన్నట్లు వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలని, మున్సిపాలిటీల్లో బీజేపీ గెలిస్తే ఏం చేయలేదని, బీఆర్ఎస్కు ఓట్లేస్తే మోరీలో వేసినట్లే అని అన్నారు. అభివృద్ధి చేయడానికి తన సొంత మండలం భీంగల్‌ను దత్తత తీసుకుంటానని అక్కడ నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రకటించారు. కార్పొరేషన్ ఛైర్మన్లు ఈరవత్రి అనీల్, మానాల మోహన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి, ముత్యాల సునీల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
అన్ని వర్గాల సంక్షేమ కోసమే సీఎం కృషి
ఆర్మూర్/ బాల్కొండ, వెలుగు: ఏ ఒక్క వర్గమని కాకుండా సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్మూర్‌లో, భీంగల్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. పనులు చేయని వారికి ఓటు వేయొద్దని, పనులు చేసే వారికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని చెప్పారు. అభివృద్ధి పనులు కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు వేసి మున్సిపల్‌కు పంపించాలని అన్నారు.
ఆరు నెలల్లో మున్సిపల్ కొత్త భవనం పనులకు టెండర్లు పూర్తి చేయించి శంకుస్థాపన చేస్తామన్నారు. ఆర్మూర్‌లో కోట్ల రూపాయలతో చేస్తున్న బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చూసి అభివృద్ధి కోసం కాంగ్రెస్‌నే ఆధారించాలని అన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు.
